ఊట్కూర్ : రైతులకు సరిపడు గన్నీ బ్యాగులను సరఫరా చేయడం లేదని ఆరోపిస్తూ నారాయణపేట జిల్లా ఊట్కూర్ ( Utkoor ) మండలంలోని పెద్దజట్రం రైతు వేదిక వద్ద రైతులు ఆందోళన ( Farmers protest ) చేపట్టారు. పీఏసీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కొనుగోలు కేంద్రం వద్ద వరి ధాన్యం కొనుగోలు చేపట్టేందుకు రైతులకు 10 రోజుల క్రితం సిబ్బంది టోకెన్లు అందించారు.
ధాన్యం నింపేందుకు గన్నీ బ్యాగులు అందించకపోవడంతో ఆందోళనకు గురవుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం మండలంలోని పెద్దజట్రం, బిజ్వారం, అవుసలోనిపల్లి గ్రామాల్లో రైతులు రైతు వేదిక వద్దకు చేరుకొని ఆందోళన చేపట్టారు. వ్యవసాయ శాఖ ఏఈఓ స్వప్న, పీఏసీఎస్ ఇన్చార్జి విద్యాసాగర్ గౌడ్ కు సమాచారం ఇచ్చిన స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ప్రభుత్వం రైతుల ఇబ్బందులను పట్టించుకోవడంలేదని, తమది రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటున్న పాలకులకు రైతుల కష్టాలు కానరావడం లేదని ఆరోపించారు. అకాల వర్షాలతో కల్లాల వద్ద ధాన్యం తడిసిపోకుండా ఎంతకాలం జాగ్రత్తలు తీసుకోవాలని ప్రశ్నించారు. రైతులకు మద్దతుగా భారతీయ కిసాన్ సంఘ్ మండల అధ్యక్షుడు ప్రవీణ్ కాంత్, రైతులు నాగరాజు, రాము, సురేందర్ రెడ్డి, నీరటి తిరుపతి, చంద్రప్ప తదితరులు పాల్గొన్నారు.