
న్యూఢిల్లీ: వివాదాస్పద వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకుంటున్నట్టు ప్రకటించే సందర్భంలో ప్రధాని నరేంద్ర మోదీ రైతులంటే తమ సర్కారుకు చాలా గౌరవం అన్నట్టుగా మాట్లాడారు. కానీ బీజేపీ నేతల ప్రవర్తన మరోలా ఉంది. గతంలో రైతులపై, రైతు ఉద్యమంపై వారు విషం చిమ్మారు. సీనియర్ నేతల కామెంట్లు మచ్చుకు ఓ డజను చూద్దాం. ‘పేరుకే రైతు చట్టాలపై నిరసన. కానీ అంతా ఉగ్రవాదులే.వారి చేతుల్లో ఏకే-47 రైఫిళ్లున్నాయ’ని రాజస్థాన్ బీజేపీ ఎంపీ జస్కౌర్ మీనా అన్నారు. ఖలిస్తాన్ జెండాలు కూడా కనిపిస్తున్నాయని పేర్కొన్నారు. కేంద్రమంత్రి అజయ్ కుమార్ మిశ్రా రైతుల ఆందోళనపై మరీ రెచ్చిపోయారు. రెండు నిమిషాలు సమయం ఇస్తే చాలు.. ఈ సన్నాసుల సంగతి తేల్చేస్తానని అవమానకరంగా మాట్లాడారు.
2నేను తల్చుకుంటే ఏమైనా చేయగలను. వారిని తరిమి కొట్టగలన’ని బీరాలు పలికారు. రైతులకు ఖలిస్తానీయులు, మావోయిస్టుల వత్తాసుందని బీజేపీ ఐటీ సెల్ హెడ్ అమిత్ మాలవీయ ఒక అబద్ధాన్ని పదేపదే చెప్తూ పోయారు. బీజేపీ జాతీయ కార్యదర్శి వై సత్యకుమార్ ఒకడుగు ముందుకు వేసి రైతుల ముసుగులో రౌడీలు వచ్చారని అవాకులు పేలారు. జిహాదీ, ఖలిస్తానీ శక్తులు ఆడిస్తున్న నాటకమని ఆందోళనను కించపర్చారు. తీవ్రవాదులు ఆందోళనను హైజాక్ చేశారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఉత్తరాఖండ్ రాష్ట్ర ఇంచార్జి దుష్యంత్‌కుమార్ గౌతమ్ అన్నారు. రైతుల ఆందోళనను ‘టుక్డే టుక్డే గ్యాంగ్’ హైజాక్ చేసిందని బీహార్ మాజీ ఉపముఖ్యమంత్రి సుశీల్‌కుమార్ మోదీ అన్నారు. దేశంలో విద్యార్థుల ఉద్యమాలు మొదలుకొని సీఏఏ వ్యతిరేక ఆందోళన దాకా అన్నిటి వెనుక ఈ ‘గ్యాంగ్’ హస్తముందని పేర్కొన్నారు. హర్యానా ముఖ్యమంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్ తన ఊహాశక్తికి పదును పెట్టారు. ఖలిస్తానీ శక్తులు దూరాయని, మోదీని చంపడం గురించిన నినాదాలు వినిపించాయని చెప్పుకొచ్చారు. రైతుల ఆందోళనలో రైతులు లేరని, పాకిస్థాన్, చైనా ఆడిస్తున్న నాటకమని కేంద్రమంత్రి రావుసాహెబ్ దనవే విషం చిమ్మారు.
ఓ మాజీ పోలీసు కానిస్టేబుల్, ఓ వైద్యుడు, ఓ మాజీ సైనికుడు, ఓ రిటైర్డ్ స్కూల్ టీచర్.. ఏమిటీ ఈ జాబితా అనుకుంటున్నారా? సాగు చట్టాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్త ఆందోళనలకు ఓ రూపాన్ని, క్రమశిక్షణతో కూడిన కార్యచరణను ఇస్తూనే.. ఉద్యమాన్ని ముందుండి నడిపించిన కీలక వ్యక్తులు వీళ్లే.
రాకేశ్ టికాయిత్, భారతీయ కిసాన్ యూనియన్ జాతీయ ప్రతినిధి.
గతంలో ఢిల్లీ పోలీసు శాఖలో కానిస్టేబుల్‌గా పనిచేశారు. రైతుల ఉద్యమానికి ప్రారంభం నుంచి దశ-దిశను ఏర్పరిచారు. గణతంత్ర దినోత్సవం నాటి హింసాత్మక ఘటనల అనంతరం రైతు ఉద్యమం నీరుగారిపోయే దశలో భావోద్వేగంతో ఆయన చేసిన ప్రసంగం యావత్ రైతు సోదరులను కదిలించింది. ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేసింది.
దర్శన్పాల్, ఆలిండియా కిసాన్ సంఘర్ష్ కో-ఆర్డినేషన్ కమిటీ సభ్యులు
వృత్తిరీత్యా వైద్యులు. సాగు చట్టాల గురించి కేంద్రం, రైతు నేతల మధ్య చర్చలకు వారధిగా నిలిచారు. రైతు సంఘాల ఐక్యతకు కృషి చేశారు. పంజాబ్‌తో పాటు యూపీ, రాజస్థాన్, మహారాష్ట్రలకు ఉద్యమాన్ని విస్తరించేందుకు వ్యూహాలు రచించారు.
జోగీందర్ సింగ్ ఉగ్రహాన్, బీకేయూ (ఉగ్రహాన్) అధ్యక్షుడు
మాజీ సైనికుడు. సునమ్ రైతు సంఘాల్లో కీలక నేత. టిక్రీ వద్ద నిరసనలకు నేతృత్వం వహించారు. రైతులు చేపట్టిన ‘రైల్‌రోకో’ దీక్ష విజయవంతం కావడానికి ఈయనే ప్రధాన కారణం.