సీఎం సోదరుల వేధింపులు భరించలేక 22న ఆత్మహత్య చేసుకున్న కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి అంతిమయాత్ర ప్రభుత్వ ఆంక్షల మధ్య కొనసాగింది. సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ముందు బారికేడ్లు ఏర్పాటు చేయడంతో అటునుంచి వెళ్లే మార్గం లేక ఇలా ఇరుకు గల్లీ నుంచి సాయిరెడ్డి మృతదేహాన్ని తరలించాల్సి వచ్చింది.
Kondareddypally | మహబూబ్‌నగర్, నవంబర్ 25 (నమస్తేతెలంగాణ ప్రతినిధి): నాగర్‌కర్నూల్ జిల్లా కొండారెడ్డిపల్లిని పోలీసులు అష్టదిగ్బంధం చేశారు. మీడియా, రాజకీయ పార్టీ నాయకులు ఎవరూ గ్రామంలోకి రాకుండా రోడ్లన్నీ బారికేడ్లతో మూసివేశారు. సీఎం రేవంత్‌రెడ్డి ఇంటి ఎదుట ఉన్న రోడ్డును కూడా క్లోజ్ చేశారు. దాదాపు 14 ఏండ్లపాటు గ్రామ సర్పంచ్‌గా కొనసాగిన 85ఏండ్ల సాయిరెడ్డి అంతిమయాత్ర అధికారం విధించిన ఆంక్షల మధ్య సాగింది. అందరితో కలివిడిగా ఉండే ఆయన.. స్థానికుల కష్టసుఖాల్లో పాలుపంచుకున్న నేతను గ్రామస్తులు కడసారి చూడాలనుకున్నా భయంతో బయటకురాలేని దుస్థితి. అధికారం విధించిన నిర్భంధంతో బయటకు అడుగుపెట్టలేదు. సాయిరెడ్డి కడుపున పుట్టిన పిల్లలు, సోదరులు, బంధువులు మాత్రమే కన్నీటి వీడ్కోలు పలకగా.. నిర్బంధానికి, అవమాన భారానికి ఇక సెలవంటూ సాయిరెడ్డి పార్థివదేహం కట్టెల్లో కాలిపోయింది. కానీ గ్రామస్థుల్లో మాత్రం భయం నెలకొన్నది. ఆ రోజు గ్రామంలో ఏం జరిగిందని ఆరా తీస్తే మాకు తెలియదని, మేము పొలం వద్దకు వెళ్లాం.. అని చెబుతున్నారు.
ఈ నెల 22న మాజీ సర్పంచ్ పాంకుంట్ల సాయిరెడ్డి (85) సీఎం సోదరుల వేధింపులు భరించలేక క్రిమిసంహారక మందు తాగి ఆత్మహత్మ చేసుకున్నాడు. నాటి నుంచి ఆయన భౌతికకాయం మార్చురీలోనే ఉన్నది. అతడి పెద్ద కొడుకు వెంకట్‌రెడ్డి తన కూతురు వద్దకు అమెరికా వెళ్లడంతో ఆయన వచ్చేవరకు మార్చురీలోనే ఉంచాలని కుటుంబసభ్యులు నిర్ణయించారు. ఇక్కడ పోలీసులు పహారా కాస్తూనే ఉన్నారు. ఆదివారం సాయంత్రం అమెరికా నుంచి వెంకట్‌రెడ్డి వచ్చి నేరుగా కల్వకుర్తి దవాఖానకు చేరుకొని తండ్రి మృతదేహం చూసి కన్నీటిపర్యంతమయ్యాడు. సోమవారం తెల్లవారుజామున 5 గంటలకే పోలీసులు సాయిరెడ్డి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. తాను రాకుండానే తన తండ్రి భౌతికకాయానికి పోస్టుమార్టం ఎలా చేస్తారని వెంకట్‌రెడ్డి పోలీసులతో వాగ్వాదం దిగారు. తర్వాత అతడికి నచ్చజెప్పి సాయిరెడ్డి మృతదేహాన్ని అంబులెన్స్‌లో కొండారెడ్డిపల్లికి తరలించారు. తెల్లవారుజామున 5 గంటల నుంచే గ్రామాన్ని అష్టదిగ్బంధం చేశారు. సాయిరెడ్డి బంధువులు ఎవరైనా వచ్చినా వివరాలు తెలుసుకొని నిర్ధారించుకున్న తర్వాతే అనుమతిచ్చారు. ఆప్తులు, బంధువుల మౌన రోదనల మధ్య అంతిమయాత్ర సాగింది. ముదుసలి అని చూడకుండా వేధింపులకు గురిచేసి ప్రాణాలు తీసుకునేలా చేస్తారా..? అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.