Congress | హైదరాబాద్, ఫిబ్రవరి6 (నమస్తే తెలంగాణ): ‘ఎన్నిక ఎన్నికకు ఒక రీతి.. రాష్ర్టానికో నీతి.. ఇదీ కాంగ్రెస్ విధానం! మాట మీద నిలబడని నైజం.. అధికారమొక్కటే లక్ష్యం.. అడ్డగోలుగా హామీలు ఇవ్వడం.. ఆపై వాటిని అటకెక్కించడం.. ఇదే కాంగ్రెస్ పార్టీ దశాబ్దాలుగా అనుసరిస్తున్న సూత్రం! అందుకు తాజాగా కాంగ్రెస్ సర్కారు నిర్వహించిన కులగణన సర్వే, ఆ నివేదికలో వెల్లడించిన గణాంకాలే నిలువెత్తు నిదర్శనం’ అంటూ నెటిజన్లు, రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కాంగ్రెస్ ద్వంద్వనీతి అనుసరిస్తున్నదంటూ సోషల్మీడియా వేదికగా తూర్పారపడుతున్నారు. దశాబ్దాలుగా బీసీలను దగా చేయడమేగాక, ఇప్పుడు గణాంకాలను తగ్గించి వంచిస్తున్నదని మండిపడుతున్నారు. 100% సర్వే చేయకుండానే సర్వే పూర్తయిందంటూ చేతులు దులుపుకుంటున్నదని విమర్శిస్తున్నారు.
ఓబీసీ కుల సంఘాల ఒత్తిడి, దశాబ్దాల పోరాటాల ఫలితంగా 2011లో కాంగ్రెస్ నేతృత్వంలోని అప్పటి యూపీఏ ప్రభుత్వం రూ.4,893.6 కోట్లు వెచ్చించి సామాజిక, ఆర్థిక, కులగణన నిర్వహించింది. దాదాపు 127.5 కోట్ల జనాభాకు సంబంధించిన సమగ్ర వివరాలు సేకరించింది. 46 లక్షల కులాలు, ఉపకులాలు, గోత్రనామాల వారీగా లెక్కలు తీసింది. అయితే, ఎస్ఈసీసీలో 1.13% తప్పులు దొర్లాయని సాకుగా చూపి ఆ నివేదికనే వెల్లడించలేదు. జనాభా లెక్కలను మాత్రమే ప్రకటించింది.
కులాలవారీగా జనాభా వివరాలను బహిర్గతం చేయలేదు. ఎస్ఈసీసీ వివరాలు 98.87% సరైనవేనని, 1.13% మాత్రమే తప్పులు దొర్లాయని జనాభా గణన కమిషనర్, రిజిస్ట్రార్ జనరల్ ధ్రువీకరించింది. సాంకేతిక పరిజ్ఞానంతో తప్పులను సరిదిద్దే అవకాశం ఉన్నదని స్పష్టంచేసింది. అయినా 1.13 శాతాన్ని సాకుగా చూపి యూపీఏ సర్కార్ ఆ లెక్కలను ప్రకటించలేదు. ఈ విషయాన్ని కేంద్ర గ్రామీణాభివృద్ధి పార్లమెంటరీ స్థాయీసంఘం (2015-16) పార్లమెంట్ వేదికగా బయటపెట్టింది. పదేండ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ సర్కారు బయట పెట్టేందుకు విముఖత చూపుతూ, ఎప్పటికప్పుడు కప్పదాటు విధానాన్ని అవలంబిస్తున్నది.
కాంగ్రెస్ పార్టీ అంటేనే ద్వంద్వ విధానాలు, దగాకోరు రాజకీయాలు అంటూ బీసీ సంఘాల నేతలు, సామాజికవేత్తలు మండిపడుతున్నారు. ఓట్ల కోసమే తప్ప కులగణనపై ఏమాత్రం చిత్తశుద్ధి లేదని మరోసారి తేటతెల్లమైందని, అందుకు తాజా నివేదిక నిదర్శనమని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. కాంగ్రెస్ బీసీ కులగణన చేపడతామని, రిజర్వేషన్లకు చట్టబద్ధత కల్పిస్తామని అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా హామీ ఇచ్చిందని గుర్తుచేశారు. అధికారంలోకి వచ్చిన అనంతరం పార్లమెంట్ ఎన్నికల్లో లబ్ధి కోసం నిరుడు ఫిబ్రవరిలో హడావుడిగా తీర్మానం చేసి చేతులు దులుపుకున్నదని వివరిస్తున్నారు.
ఏడు నెలలపాటు ఎలాంటి సర్వే ఊసే ఎత్తలేదని మేధావులు, నిపుణులు, బీసీ సంఘాల నేతలు విమర్శిస్తున్నారు. మహారాష్ట్రలో ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు ఇక్కడ హడావుడిగా, ప్రణాళిక లేకుండా సర్వే చేపట్టారని ఆరోపిస్తున్నారు. ఇంటింటి సర్వే సజావుగా కొనసాగడం లేదని ఫిర్యాదులు చేసినా స్పందించలేదంటూ అసంతృప్తి వ్యక్తంచేశారు. బీహార్లో కులగణన సర్వే నిర్వహించిన సమయంలో ఆ రాష్ట్ర సీఎం దాదాపు 100కుపైగా సమావేశాలు నిర్వహించారని, క్షేత్రస్థాయిలో సమస్యలు, సవాళ్లను అధిగించేందుకు సలహాలు, సూచనలు చేస్తూ ఎప్పటికప్పుడు ఆదేశాలు, ఉత్తర్వులు జారీ చేస్తూ పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటుచేశారని చెప్తున్నారు.
కానీ, రాష్ట్రంలో ఇంటింటి సర్వేపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, మంత్రులు ఒకటి అర సమావేశాలు నిర్వహించారు తప్ప ఎక్కడా చిత్తశుద్ధి చూపలేదని బీసీ నేతలు మండిపడుతున్నారు. ఢిల్లీ ఎన్నికల వేళ హడావుడిగా అసమగ్రమైన సర్వే నివేదికను వెల్లడించిందని ఆరోపిస్తున్నారు. ఇప్పుడు 3.1% మందిని సర్వే చేయలేదని చెప్తూనే గణాంకాలను వెల్లడించిందని, ఇది కాంగ్రెస్ చిత్తశుద్ధిలేమికి నిదర్శనమని దుయ్యబడుతున్నారు. అడుగడుగునా ఎన్నికల కోణమే తప్ప, ప్రభుత్వం చేపట్టిన సర్వేలో ఎక్కడా నిజాయితీ లేదని ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా సర్వేను 100% పూర్తిచేయాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే నివేదికను అంగీకరించేది లేదని చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో 3.1% మందిని సర్వే చేయకుండానే, అసంబద్ధ విధానాలను అనుసరించి, అరకొరగా సమాచారాన్ని సేకరించి, తప్పుల తడకగా రూపొందించిన గణాంకాలను వెల్లడించింది. అదే ప్రామాణికమని చెప్తుండటం బీసీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రణాళిక శాఖ గత నవంబర్లో ఇంటింటి సర్వేను నిర్వహించింది. రాష్ట్రంలో మొత్తం 3.7 కోట్ల మంది జనాభా ఉండగా, అందులో 3,54,77,554 (96.9%) మందిని సర్వే చేసి వివరాలు సేకరించామని ప్రభుత్వమే అధికారికంగా వెల్లడించింది. 1.03 లక్షల ఇండ్లకు తలుపులు వేసి ఉండటం, 1.68 లక్షల కుటుంబాలు మొదట్లో పాల్గొనడానికి సంకోచించడం, 84,137 ఇండ్లు నివాసేతరంగా ఉండటం వంటి సమస్యలు ఎదురయ్యాయని, 16 లక్షల జనాభా వివరాలను సేకరించలేదని తెలపడం గమనార్హం. 1.13% తప్పులనే నాడు సాకుగా చూపినా కాంగ్రెస్, ఇప్పుడు 3.1% మం దిని మినహాయించిన గణాంకాలను ఎలా వెల్లడిస్తారని బీసీ వర్గాలు నిలదీస్తున్నాయి. గణాంకాలు అసంబద్ధంగా ఉన్నాయని మండిపడుతున్నారు.