హైదరాబాద్, జూన్12 (నమస్తే తెలంగాణ) : ఛత్తీస్‌గఢ్ తన వాటా జలాలను వినియోగించుకుంటే గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు భవిష్యత్తు ఏమిటని ఎన్‌డబ్ల్యూడీఏ అధికారులను టాస్క్‌ఫోర్స్ కమిటీ నిపుణులు ప్రశ్నించారు. ఈ నెల 24న నిర్వహించనున్న కన్సల్టెన్సీ సమావేశంలో దీనిపై పూర్తిస్థాయిలో చర్చించాలని నిర్ణయించారు. నదుల అనుసంధాన ప్రాజెక్టులకు సంబంధించిన టాస్క్‌ఫోర్స్ కమిటీ ఢిల్లీలో గురువారం ప్రత్యేకంగా సమావేశమైంది. రివర్ లింక్ ప్రాజెక్టుల పురోగతి, అందులో నెలకొన్న అంశాలపై చర్చించింది. ఈ సందర్భంగా గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టుపైనా కమిటీ నిపుణులు చర్చించారని సమాచారం. ఈ సందర్భంగా జీసీ లింక్‌పై పలువురు ప్రశ్నలు సంధించినట్టు సమాచారం. వాస్తవంగా హిమనీనదాల నుంచి తొలుత జలాలను గోదావరికి, ఆ తరువాత గోదావరి నుంచి కృష్ణా మీదుగా కావేరికి దశలవారీగా తరలించాల్సి ఉంది.
కానీ తొలుత గోదావరి-కావేరిని చేపట్టాలని కేంద్రం నిర్ణయించింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం తన వాటాలో వినియోగించుకోని 148 టీఎంసీల జలాలను కావేరికి తరలించాలని ప్రతిపాదనలు చేసింది. దీనిపై ఆ రాష్ట్రంతోపాటు గోదావరి బేసిన్‌లోని ఇతర రాష్ర్టాలు సైతం వ్యతిరేకించాయి. తాజాగా జరిగిన సమావేశంలోనూ ఇదే విషయమై చర్చించినట్టు తెలిసింది. మున్ముందు ఛత్తీస్‌గఢ్ తన వాటా జలాలను వినియోగించుకుంటే జీసీ లింక్ భవిష్యత్తు ఏమిటని ప్రశ్నించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో జీసీ లింక్‌పై 24వ తేదీన రాష్ర్టాలతో నిర్వహించనున్న కన్సల్టెన్సీ మీటింగ్‌లో చర్చించాలని నిర్ణయించినట్టు సమాచారం.