పాలకుర్తి, జూన్ 5 : ‘ఇందిరమ్మ ఇండ్లు కాంగ్రెస్ కార్యకర్తలకే.. ఎమ్మెల్యే మనుషులకే ఇస్తాం. ఇవి ఎమ్మెల్యే కోటా! ప్రభుత్వానికి సంబంధం లేదు. అందులో కలెక్టర్‌కు కూడా అధికారం లేదు’ అని జనగామ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారి కుండబద్దలు కొట్టారు. పాలకుర్తి మండలం బమ్మెర గ్రామానికి చెంది న జంపాల రాజు తనకు ఇందిరమ్మ ఇల్లు రాలేదంటూ జిల్లా గృహ నిర్మాణ శాఖ అధికారికి ఫోన్ చేయగా.. ఆ అధికారి సంభాషణ ఆడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
ఆ వివరాలు ఇలా ఉన్నాయి ‘రాజూ.. ఇందిరమ్మ ఇండ్లు అనేవి పైకి చెప్పినంత నిజాయితీగా పేదలకు రావు. కాంగ్రెస్ కార్యకర్తలకు మాత్రమే వస్తాయి. ఇందిరమ్మ ఇండ్లు ఎమ్మెల్యే కోటా! అవి ఎమ్మెల్యే చెప్పిన వాళ్లకు, కాంగ్రెస్ కార్యకర్తలకు వస్తయ్. మీలాంటి పేదలకు రావు. అధికారులుగా ఎంపికలో మాకు ఎలాంటి సంబంధం లేదు. కలెక్టర్‌కు కూడా ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక అధికారం లేదు. కలెక్టర్‌కే అధికారం లేనప్పుడు అధికారులుగా మాకేం ఉంటది? పంచాయతీ కార్యదర్శికి ఏం అధికారం ఉంటది? ఇందిరమ్మ ఇండ్ల ఎంపిక అనేది ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే మనుషులకు మాత్రమే ఉంటుంది. ప్రభుత్వానికి కూడా ఏం సంబంధం లేదు’ అని స్పష్టంచేశారు.