హైదరాబాద్, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి, కరీంనగర్ జిల్లాల్లోని 5 వాణిజ్య ప్లాట్ల వేలానికి తెలంగాణ హౌసింగ్ బోర్డు నోటిఫికేషన్ జారీచేసింది. రంగారెడ్డి జిల్లా శేరిలింగంపల్లి మండలం చందానగర్ ఆరెంజ్ టౌన్షిప్లో 2,593 చదరపు గజాలు, 1,809 చదరపు గజాలు, 2,716 చదరపు గజాల విస్తీర్ణం కలిగిన 3 ప్లాట్లతోపాటు కరీంనగర్ జిల్లా పాత పవర్‌హౌస్ కాలనీలో 4,335 చదరపు గజాలు, 3,025 చదరపు గజాల ప్లాట్లను ఆన్లైన్లో వేలం వేయనున్నట్టు వెల్లడించింది. చందానగర్‌లోని ప్లాట్లకు కనీస ధరను చదరపు గజానికి రూ.40 వేలుగా, కరీంనగర్‌లోని ప్లాట్లకు రూ.30 వేలుగా నిర్ణయించింది. చందానగర్‌లోని ప్లాట్లను ఈ నెల 15న, కరీంనగర్‌లోని ప్లాట్లను 17న వేలం వేయనున్నట్టు తెలిపింది. ఈ ప్లాట్ల కొనుగోలుకు ఆసక్తి ఉన్నవారు రూ.1,180 చెల్లించి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని, నాంపల్లి గృహకల్పలోని హౌసింగ్ బోర్డు కార్యాలయంలో ఈ నెల 9 మధ్యాహ్నం 3 గంటలకు ప్రీబిడ్ సమావేశాన్ని నిర్వహించనున్నామని స్పష్టం చేసింది.