బాసర: నిర్మల్ జిల్లా బాసర ఐఐఐటీ (Basara IIIT) వద్ద ఆందోళన వాతావరణం నెలకొంది. రెండు నెలలుగా జీతాలివ్వకపోవడంతో పారిశుద్ధ్య కార్మికులు కళాశాల ప్రధాన గేటు వద్ద ఆందోళన నిర్వహించారు. విధులు బహిష్కరించిన సుమారు 150 మంది కార్మికులు గేటు వద్ద బైఠాయించారు. 2 నెలల నుంచి ఫస్ట్ మ్యాన్ (FIRST MAN) కంపెనీ జీతాలు ఇవ్వటం లేదని, 8 వీడీఏ (VDA)లు ఇవ్వకుండా నిలిపివేశారని ఆందోళన వ్యక్తం చేశారు. కళాశాల అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ఆరోపించారు.
నెలల తరబడి జీతాలు ఇవ్వకుండా శ్రమ దోపిడీకి పాల్పడుతున్నారని మండిపడ్డారు. తమ న్యాయపరమైన డిమాండ్ల సాధన కోసం మీడియా ముఖంగా చెబితే వేధింపులకు గురి చేస్తున్నారని, విధుల నుంచి తొలగిస్తామని బెదిరిస్తున్నారని కార్మికులు వాపోయారు. తమ ఆవేదన ఎవరికి చెప్పుకోవాలో తెలియక గేటు ముందు బైఠాయించామన్నారు. పెరిగిన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు.