Samagra Kutumba Survey | హైదరాబాద్, నవంబర్ 13 (నమస్తే తెలంగాణ): తెలంగాణలోని అన్ని వర్గాల ప్రజల లెక్కలను తీస్తామని, ఆ వివరాల ఆధారంగా అందరికీ సామాజిక న్యాయం చేస్తామని, రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్తూ రాష్ట్ర ప్రభుత్వం ఇంటింటి సర్వేను నిర్వహిస్తున్నప్పటికీ ఆ సర్వే నివేదిక వెల్లడవుతుందా? అనే అనుమానాలు సర్వత్రా నెలకొన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3 రాష్ర్టాల్లో కుల సర్వే నిర్వహించినప్పటికీ రాజ్యాంగ, చట్ట పరిమితులతోపాటు ఇతర న్యా యపరమైన అంశాల వల్ల ఆ నివేదికలు ప్రజలకు అందుబాటులోకి రాకపోవడమే ఈ అనుమానాలకు ప్రధాన కారణం. గతంలో తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర కుటుంబ సర్వే నివేదిక కూడా ఈ కారణాల వల్లే వెలుగుచూడలేదని, ఇదేవిధంగా ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న సర్వే కూడా అటకెక్కడం ఖా యమని సామాజికవేత్తలు స్పష్టం చేస్తున్నారు.
వాస్తవానికి దేశంలో జనాభా లెక్కలను సేకరించే అధికారం కేంద్ర ప్రభుత్వానికే ఉన్నది. అందుకోసం 1948లో సెన్సస్ యాక్ట్‌ను రూపొందించారు. ఈ చట్టాన్ని అనుసరించే కేంద్ర ప్రభుత్వం ప్రతి పదేండ్లకోసారి జనగణన చేపడుతున్నది. ఈ లెక్కన 2021లో జనగణన చేపట్టాల్సి ఉన్నప్పటికీ కొవిడ్ విజృంభణ వల్ల చేపట్టలేదు. జనాభా లెక్కల కోసం కేంద్ర ప్రభుత్వం సెన్సస్ యాక్ట్‌కు అనుగుణంగా నోటిఫికేషన్ జారీ చేస్తుంది. ఆ తర్వాత కమిషనర్‌ను, నోడల్ ఆఫీసర్లు, డిపార్ట్మెంట్ను నియమిస్తుంది. ఆపై జనగణన చేపట్టి ఆ గణాంకాలను ప్రకటిస్తుంది. ఈ చట్టాన్ని అనుసరించి జనాభా లెక్కలను సేకరించే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు లేదు.
కేంద్ర ప్రభుత్వం 2008లో గణాంకాల సేకరణ చట్టాన్ని తీసుకొచ్చింది. తద్వారా నిర్దేశిత ప్రాంతానికి, వర్గానికి సంబంధించిన భౌగోళిక, సామాజిక, ఆర్థిక, విజ్ఞాన, పర్యావరణ, పారిశ్రామిక అంశాలపై సర్వే నిర్వహించే వెసులుబాటును కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక సంస్థలకు సైతం కల్పించింది. దీంతో సామాజిక, ఆర్థిక సర్వేలన్నీ ఈ చట్టానికి అనుగుణంగానే జరుగుతున్నాయి. 7వ షెడ్యూల్లో కేంద్ర జాబితాలో ఉన్న జనగణన అంశానికి ఈ చట్టం వర్తించదు. 2008 చట్టానికి అనుగుణంగా కేవలం సర్వేలు మాత్రమే నిర్వహించాలి. అందుకోసం విధిగా నోడల్ ఆఫీసర్‌ను నియమించాలి. సర్వేలో సేకరించిన డాటాను పబ్లిక్ డొమైన్లో పెట్టేందుకు కూడా కేంద్రం అనేక ఆంక్షలు విధించింది. విధివిధానాల రూపకల్పనలో కేంద్రం భాగస్వామ్యం, అనుమతి తప్పనిసరి. సూటిగా చెప్పాలంటే కేంద్ర ప్రభుత్వ భాగస్వామ్యంతోనే రాష్ర్టాలు సర్వేను నిర్వహించాలి.
రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తున్న సర్వేలు వివాదాస్పదంగా మారడానికి సంబంధిత విధానాలు, చట్టపరిమితులే ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. ఇప్పుడు ఇంటింటి సర్వే పేరుతో రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నదని, కులగణనే కాకుండా సమగ్ర జనగణనను కూడా నిర్వహిస్తున్నదని సామాజికవేత్తలు ఆక్షేపిస్తున్నారు. అంతేకాకుండా 2008 గణాంకాల సేకరణ చట్టానికి అనుగుణంగా నోడల్ ఆఫీసర్‌ను నియమించకుండా, నిపుణుల కమిటీ లేకుండా కేవలం ప్లానింగ్ బోర్డును నోడల్ డిపార్ట్మెంట్గా నియమించిందని, పూర్తిగా అధికార యంత్రాంగంతోనే ప్రశ్నావళిని రూపొందించి సర్వే నిర్వహిస్తున్నదని మండిపడుతున్నారు. దీంతో ఈ సర్వే కూడా న్యాయవివాదాల్లో చిక్కుకోవడం, నిష్ప్రయోజనకరంగా మారడం ఖాయమని నిప్పులు చెరుగుతున్నారు.