హైదరాబాద్, మే 18 (నమస్తే తెలంగాణ): అర్హులైన జర్నలిస్టులకు ఇండ్ల స్థలాలివ్వాలని, సొసైటీల్లో సభ్యత్వం తీసుకోని వారి నుంచీ ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి అందరికీ అవకాశం కల్పించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వరింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే-143)తరఫున సమాచార, పౌరసంబంధాలశాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డిని కోరారు. ఈ మేరకు సోమవారం సచివాలయంలో ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆసాని మారుతీసాగర్ నేతృత్వంలో మంత్రికి వినతిపత్రం అందజేశారు. అనంతరం జర్నలిస్టులపై యూనియన్ నాయకులు మంత్రితో చర్చించారు.
గత 20 ఏండ్లకు పైగా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తున్న జర్నలిస్టులు సొంతింటి కల సాకారం కోసం ఎదురుచూస్తున్నారని, జర్నలిస్టులకు ఇండ్లస్థలాలు ఇవ్వడానికి ప్రస్తుత ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతున్న సందర్భాన్ని తమ యూనియన్ ఆ హ్వానిస్తున్నదని తెలిపారు. సొసైటీల్లో సభ్యత్వం తీసుకోకుండా ఉన్న అర్హులైన జర్నలిస్టులకు సైతం నేరుగా ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించి అందరికీ న్యాయం చేయాలని, ఇండ్లస్థలాల పరిశీలనతోపాటు దరఖాస్తుల పరిశీలనకు వేసిన హౌసింగ్ కోఆర్డినేషన్ కమిటీలో జర్నలిస్టు సంఘాలకు ప్రా తినిధ్యం కల్పించాలని కోరారు. మంత్రిని కలిసిన వారిలో టీయూడబ్ల్యూజే రాష్ట్ర కో శాధికారి పీ యోగానందం, ఐజేయూ నా యకులు అవ్వారి భాసర్, హైదరాబాద్ జిల్లా ఇన్చార్జి నవీన్‌కుమార్ యారా, ప్రధాన కార్యదర్శి సోమేశ్, కోశాధికారి బాపూరావు తదితరులు పాల్గొన్నారు.
చిన్నపత్రికల జాబితా పంపండి
అక్రెడిటేషన్ కార్డుల జారీకి సంబంధించి భారీ, మధ్యతరహా పత్రికల జాబితా మాత్రమే జిల్లా పౌరసంబంధాల అధికారులకు పంపడంతో జిల్లాల్లో గందరగోళ పరిస్థితి నెలకొన్నదని, చిన్న పత్రికల జాబితా కూడా వెంటనే జిల్లాలకు పంపాలని సమాచార పౌర సంబంధాలశాఖ స్పెషల్ కమిషనర్ ముకుందరెడ్డిని నాయకులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు ఐఅండ్ పీఆర్ కార్యాలయంలో స్పెషల్ కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.