హైదరాబాద్, డిసెంబర్ 6 (నమస్తే తెలంగాణ): అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్ ట్యాంక్‌బండ్‌లోని మహావిగ్రహానికి కనీసం పూలమాల వేయకుండా సర్కారు అవమానించింది. రాజ్యాంగ నిర్మాతకు నివాళులర్పించేందుకు వెళ్లిన బీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలపై నిర్బంధకాండను అనుసరించింది. సర్కారు వైఖరిని నిరసిస్తూ ట్యాంక్‌బండ్‌పై బీఆర్ఎస్ నేతలు ధర్నాకు సిద్ధమవగా భగ్నం చేసేందుకు పూనుకున్నది. పోలీసులను ఉసిగొల్పి నేతలను ఎక్కడికక్కడ అరెస్ట్ చేయించింది. సచివాలయం సమీపంలోని 125 అడుగుల అంబేద్కర్ విగ్రహం వద్ద పెద్దసంఖ్యలో పోలీసులను మొహరించింది. పరిసరాల్లోకి నాయకులతో పాటు సామాన్యుల కూడా అనుమతించలేదు. ధర్నాకు వెళ్తున్నారనే సమాచారంతో మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావును హైదరాబాద్‌లోని ఆయనను హౌజ్ అరెస్టు చేసింది.
మాజీమంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్ నివాసం వద్ద కూడా శుక్రవారం తెల్లవారుజాము నుంచే పోలీసులు మోహరించారు. వ్యక్తిగత పనులపై బయటకు వెళ్తామని చెప్పినా పోలీసులు వినిపించుకోలేదు. ఎమ్మెల్సీ కవితను నందినగర్‌లోని ఆమె నివాసంలోనే పోలీసులు నిర్బంధించారు. ఉదయాన్నే అక్కడికి చేరుకున్న సిబ్బంది చీకటిపడేదాకా ఆమె ఇంటివద్దే కాపాలకాశారు. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానందను హౌస్అరెస్ట్ చేశారు. కొంపల్లి దండెమూడి ఎంక్లేవ్లోని ఆయన ఇంటి ఎదుట పదుల సంఖ్యలో పోలీసులు మొహరించారు. విషయం తెలుసుకున్న పార్టీ నాయకులు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్నది. అంబేద్కర్ విగ్రహానికి నివాళులర్పించేదుకు బయల్దేరిన బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్‌యాదవ్‌ను సచివాలయం సమీపంలో అరెస్ట్ చేసి, బేగంబజార్ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. నగరంలోని బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను ఎక్కడికక్కడ ఇండ్లలో నుంచి బయటకు రాకుండా అడ్డుకున్నారు.
తెలంగాణ భవన్ వద్ద హైటెన్షన్
అంబేద్కర్ వర్ధంతి కార్యక్రమంలో పాల్గొనేందుకు మాజీమంత్రి కేటీఆర్ శుక్రవారం ఉదయం తెలంగాణ భవన్‌కు వస్తున్నారనే సమాచారంతో పోలీసులు పెద్దసంఖ్యలోఅక్కడికి చేరుకున్నారు. భవన్లో ఉన్నంతసేపూ బయట మొహరించారు. కేటీఆర్‌ను అరెస్ట్ చేయనున్నారని తెలియడంతో పెద్దసంఖ్యలో బీఆర్ఎస్ కార్యకర్తలు అక్కడికి చేరుకోవడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. ఎప్పుడేం జరుగుతుందోనని ఆందోళన కనిపించింది. కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కేటీఆర్ బయటకు వస్తుండగా భవన్ ప్రధాన ద్వారం ఎదుట పోలీసులు నిలబడ్డారు. అంబేద్కర్ విగ్రహం వద్దకు వెళ్లవద్దని వారించారు.