హైదరాబాద్, సెప్టెంబర్ 29(నమస్తే తెలంగాణ): హాస్టళ్లకు జీఎస్టీ మినహాయిస్తూ జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తీసుకున్నట్టు ఫెడరేషన్ ఆఫ్ తెలంగాణ చాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్‌టీసీసీఐ) తెలిపింది. ఒక్కో అభ్యర్ధికి నెలకు 20 వేల ఫీజు వరకు ఈ మినహాయింపు దేశ వ్యాప్తంగా అన్ని హాస్టళ్లకు వర్తిస్తుందని పేర్కొన్నారు. దీంతో హాస్టళ్లు, పేయింగ్ గెస్ట్ సౌకర్యాన్ని వినియోగించుకుంటున్న అభ్యర్థులతోపాటు హాస్టళ్ల నిర్వాహకులకు మేలు జరుగుతుందని చెప్పారు.
జీఎస్టీ మినహాయింపుపై ఎఫ్‌టీసీసీఐ, ఐటీ కారిడార్ హాస్టల్స్ అసోసియేషన్ ప్రతినిధులు ఆదివారం జీఎస్టీ అండ్ కస్టమ్స్ హైదరాబాద్ జోన్ చీఫ్ కమిషనర్ సందీప్ ప్రకాశ్‌ను కలిసి ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలోని 10వేల హాస్టళ్లలో 4లక్షల మంది ఉంటున్నారు.