హుస్నాబాద్, జూలై 18: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ బీసీ సంక్షేమ వసతిగృహంలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆనంద్, మనోజ్ శుక్రవారం పురుగులమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కరీంనగర్‌కు చెందిన వీరిద్దరు సంక్షేమ హాస్టల్లో ఉంటూ స్థానికంగా ఉన్న ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్నారు. హాస్టల్లోని ఇతర విద్యార్థులు ఇంటి నుంచి తెచ్చుకున్న తినుబండారాలను వీరిద్దరు దొంగతనం చేసి తింటున్నారని, తోటి విద్యార్థులను బెదిరింపులకు గురిచేస్తున్నారని వార్డెన్‌కు, హెచ్ఎంకు బాధిత విద్యార్థులు ఫిర్యాదు చేశారు.
పేర్లు తొలగించి హాస్టల్నుంచి పంపిస్తానని వార్డెన్ బెదిరించడంతో భయభ్రాంతులకు గురైన ఆనంద్, మనోజ్ హాస్టల్లోనే పురుగులమందు తాగారు. గమనించిన హాస్టల్ సిబ్బంది స్థానిక దవాఖానకు తరలించగా మెరుగైన వైద్యం కోసం కరీంనగర్ దవాఖానకు పంపారు. ప్రస్తుతం వీరిద్దరి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్టు తెలిసింది. హాస్టల్లో వార్డెన్‌తో పాటు సిబ్బంది పర్యవేక్షణ సరిగా లేకనే విద్యార్థులు గొడవలకు దిగుతున్నారని, క్రమశిక్షణ లేకుండా తయారవుతున్నారని తల్లిదండ్రులు, విద్యార్థులు ఆరోపిస్తున్నారు.