హైదరాబాద్, డిసెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ఉద్యాన పంటల సాగు అస్తవ్యస్తంగా మారింది. రైతులకు అందాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలు రెండేండ్లుగా నిలిచిపోయాయి. రైతులు ఉద్యానపంటలు సాగుచేయడానికి ఆసక్తి చూపడంలేదు. రాష్ట్రంలో 2014 నుంచి 2023 వరకు వ్యవసాయ అనుబంధ రంగాలకు బీఆర్ఎస్ ప్రభుత్వం పెద్ద ఎత్తున రాయితీలు అందించింది. పంటలను విక్రయించేందుకు అవసరమైన ఏర్పాట్లు చేసింది. ఉద్యాన రైతులు లాభాలు గడించారు. ఉద్యాన పంటల సాగువైపు మొగ్గుచూపారు. కరోనా టైమ్‌లోనూ ప్రజలకు కూరగాయలు, పండ్ల అవసరాలు తీరాయి. ప్రభుత్వం ప్రత్యేకంగా రైతుబజార్లు, కౌంటర్లను ఏర్పాటుచేయడంతో పంటలకు మంచి ధరలు దక్కాయి. కాంగ్రెస్ సర్కార్ పాలనలో భిన్నమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఉద్యాన పంటలకు రాయితీలు, కూరగాయలు, పండ్లకు గిట్టుబాటు ధర దక్కడంలేదు.
బీఆర్ఎస్ ప్రభుత్వం కూరగాయల సాగు విస్తీర్ణాన్ని పెంచేందుకు రైతులకు విత్తనాలను భారీ సబ్సిడీతో అందించింది. కృషి వికాస యోజన పథకం కింద 50 శాతం రాయితీతో హైబ్రిడ్ కూరగాయల విత్తనాలను, 75 శాతం రాయితీతో ఉల్లి విత్తనాలను సరఫరా చేసింది. శాశ్వత పందిర్ల నిర్మాణానికి ఎకరాకు రూ.లక్ష చొప్పున రెండున్నర ఎకరాల పరిమితితో 50శాతం రాయితీ అందించింది. కాంగ్రెస్ పార్టీ ఎకరానికి రూ.9వేలు సబ్సిడీ అందిస్తామని ప్రకటించినప్పటికీ.. రెండేండ్లలో ప్రణాళిక ఆచరణకు నోచలేదు. మైక్రో ఇరిగేషన్‌కు బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాధాన్యమిచ్చింది. ఎస్సీ/ఎస్టీ రైతులకు 100 శాతం, బీసీలు, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతరులకు 80 శాతం రాయితీ ఇచ్చింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ఈ పథకం ఆగిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం భారీ సబ్సిడీలతో పాలీహౌజ్, గ్రీన్‌హౌజ్ సాగుకు శ్రీకారం చుట్టింది. ఎస్సీ, ఎస్టీలకు గరిష్ఠంగా ఎకరాకు రూ.36.37 లక్షల రుణాన్ని 95 శాతం సబ్సిడీతో, ఇతరులకు 75 శాతం సబ్సిడీతో ఎకరాకు రూ.29.52 లక్షలు మంజూరు చేసింది. కాంగ్రెస్ పాలనలో ఇది అటకెక్కింది.