భైంసా : వివాహేతర సంబంధం ఓ మహిళ ప్రాణాలు బలిగొంది. పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం. కుంసర గ్రామానికి చెందిన అశ్విని(28)కి భైంసా ( Bhainsa ) కు చెందిన జోంద్లే సంతోష్‌తో వివాహం కాగా, విబేధాల కారణంగా కొన్నేళ్లుగా విడిపోయి ఉంటున్నారు.
తన ఇద్దరు పిల్లలతో కలిసి కుంసరలో తల్లి వద్ద ఉంటున్న అశ్వినికి కొద్దినెలల కిందట పట్టణంలోని అంబేద్కర్ నగర్‌కు చెందిన నాగేశ్ ( Nagesh ) తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరు కలిసి సంతోషిమాత నగర్లో టీ స్టాల్ నడుపుతుండగా, ఆమె మరొకరితో తరచూ ఫోన్లో మాట్లాడుతుందన్న కారణంతో సోమవారం టీస్టాల్లోనే గొడవపడ్డాడు. ఈ క్రమంలో నాగేశ్ కోపంతో రాడ్‌తో అశ్విని తలపై కొట్టి కత్తితో గొంతుకోశాడు. దీంతో అశ్విని అక్కడికక్కడే మృతి చెందింది.
సమాచారమందుకున్న పోలీసులు ఘటనాస్థలికి వెళ్లి పరిశీలించారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఏరియాస్పత్రికి తరలించారు. మృతురాలి తల్లి గైక్వాడ్ భారతిబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.