ఓదెల, జులై 1 : పెద్దపల్లి జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఓదెల శ్రీ మల్లికార్జున స్వామి ఆలయ ఆవరణలో బుధవారం భక్తులపై తేనెటీగలు దాడి చేశాయి. బుధవారం మల్లన్న జాతర కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయానికి తరలివచ్చారు. కాగా ఇక్కడ స్వామివారికి నైవేద్యం పెట్టడానికి కట్టెల పొయ్యిలతో బోనం వంటలు చేశారు. కట్టెల కట్టెల పొయ్యిలతో వెలువడిన పొగతో చెట్లపై ఉన్న తేనెటీగలు లేచి భక్తులపై దాడికి దిగాయి.
దీంతో భక్తులు పరుగులు పెట్టాల్సి వచ్చింది. పిల్లలు, మహిళలు రక్షణ కవచంగా దుస్తులను ఒంటిపై కప్పుకొని ఆలయానికి దూరంగా పరిగెత్తారు. కొంతమంది భక్తులకు తేనెటీగలతో గాయాలు అవడంతో 108 వాహనంలో దావకానకు తరలించారు. ఇక్కడ కొంతకాలంగా చెట్లపై తేనెటీగలు ఉన్నాయని తెలుపుతున్న ఎవరూ పట్టించుకోకపోవడం వలన ఈ ప్రమాదం జరిగినట్లు భక్తులు పేర్కొంటున్నారు.