Real Estate | హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 16(నమస్తే తెలంగాణ) : గతమెంతో ఘనం.. భవిష్యత్తు ప్రశ్నార్థకం.. అన్నట్టుగా హైదరాబాద్ రియల్ ఎస్టేట్ వ్యాపార పరిస్థితి మారింది. ఒకప్పుడు ఎకరం రూ.100 కోట్లకు విక్రయించి, ప్రపంచస్థాయి పెట్టుబడులను ఆకర్షిస్తే, ఇప్పుడు కనీసం కట్టిన ఇండ్లను కూడా అమ్ముకోలేని దయనీయ పరిస్థితి దాపురించింది. ఏడాదిగా పడిపోయిన రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు ప్రాప్‌టైగర్ నివేదిక నిదర్శనంగా నిలుస్తున్నది. దేశంలోని అన్ని మెట్రో నగరాల్లో ఉన్న క్రయవిక్రయాలపై వెల్లడించిన ప్రాప్‌టైగర్ నివేదికలో హైదరాబాద్‌లో నిరుటితో పోల్చితే 2024 అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో 36% మేర అమ్మకాలు పడిపోయినట్టుగా తేలింది. ఓవైపు హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ పరుగులు పెడుతున్నదని ప్రభుత్వం బుకాయిస్తు న్నా, క్షేత్రస్థాయి వాస్తవాలు ఇలాంటి నివేదికలతో వెలుగులోకి వస్తూనే ఉన్నా యి. కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో హైదరాబాద్ కేంద్రంగా రియల్ ఎస్టేట్ రంగం ఏడాదిగా కోలుకోలేకపోతున్నది. మహానగరంలో మార్కెట్ స్థితి, ఇండ్ల ని ర్మాణం, అమ్మకాల తీరు తెన్నులపై ప్రముఖ రియల్ ఎ స్టేట్ అధ్యయన సంస్థ అయిన ప్రా ప్టైగర్ వార్షిక నివేదికను విడుదల చేసింది. 2023తో పోల్చితే హైదరాబాద్ కేంద్రంగా అమ్మకాలు భారీగా క్షీణించినట్టు వెల్లడైంది. దేశవ్యాప్తంగా 4% వృద్ధి ఉంటే హైదరాబాద్‌లో మాత్రం డౌన్ ట్రెండ్ కొనసాగుతూనే ఉన్నదని తేలింది. నగరంలో కొన్ని నెలలుగా రిజిస్ట్రేషన్లు భారీగా పడిపోగా, ముఖ్యంగా ఇండ్లు, ఓ పెన్ ప్లాట్ల క్రయవిక్రయాలు క్రమంగా తగ్గుతున్నాయి.
ప్రాప్‌టైగర్ నివేదిక ప్రకారం దేశంలో అత్యధికంగా అమ్మకాలు పడిపోయిన నగరాల జాబితాలో 36%అమ్మకాలు తగ్గి హైదరాబాద్ తొలిస్థానంలో ఉండగా, 5 శాతం అమ్మకాలు మాత్రమే తగ్గి చెన్నై చివరన ఉన్నది. పదేండ్లకాలంగా ఆకాశన్నంటే స్థాయిలో బహుళ అంతస్తుల భవనాలు దూసుకుపోగా, ఇప్పుడేమో హైడ్రా పేరిట పలుచోట్ల పేక మేడల్లా భవనాలు కూలిపోతున్నాయి. సామాన్య జనాలతోపాటు, రియల్ ఎస్టేట్ వ్యాపారులూ భయాందోళనకు గురవుతున్నారు. 8 నెలలుగా పేదలు, సామాన్యుడికి కంటిమీద కునుకు లేకుండా హైడ్రాను ప్రభుత్వం ఉసిగొల్పిందని గగ్గోలు పెడుతన్నారు.
2023 ఆగస్టు నెల నుంచే హైదరాబాద్ పరిధిలో క్రయవిక్రయాలు పడిపోయాయి. ఇప్పటివరకు సిటీ రియాల్టీ దిగజారుతూనే ఉన్నది. పదుల సంఖ్యలో అమ్మకాలు క్షీణించినట్టుగా అధ్యయనాలు వెల్లడించాయి. ప్రభుత్వం దిద్దుబాటు చర్యలపై దృష్టి పెట్టకుండా, మార్కెట్‌ను మరింత దెబ్బకొట్టే చర్యలకు దిగింది. మూసీ ప్రక్షాళన, ఫార్మా సిటీ రద్దు, ఎయిర్‌పోర్టు మెట్రో లైన్ మార్పు, హైడ్రా, వక్ఫ్ భూముల పేరిట రిజిస్ట్రేషన్లు నిలిపివేయడంతో రియల్ ఎస్టేట్ వ్యవస్థ కోలుకోలేకపోతున్నది. నిర్మాణ అనుమతుల్లోనూ కాంగ్రెస్ నేతల చేతివాటంతో బిల్డర్లు బెంబేలెత్తుతున్నారనే విమర్శలు ఉన్నాయి. రియల్ ఎస్టేట్ సంస్థలు ప్రాపర్టీ షోలతో మార్కెట్‌ను ప్రభావితం చేయాలని భావించినా ఫలితం దక్కలేదని తెలిసింది.