హైదరాబాద్, జనవరి 12 (నమస్తే తెలంగాణ): రెండు దేశాల పాస్‌పోర్టులు ఉన్నంత మాత్రాన ఆ రెండు దేశాల పౌరసత్వం ఉన్నట్టు కాదని బీఆర్ఎస్ నేత, వేములవాడ మాజీ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్ హైకోర్టుకు నివేదించారు. జర్మనీ పాస్పోర్టుతో పర్యటిస్తే తమ దేశ పౌరుడు కాబోరని జర్మనీ రాయబార కార్యాలయం తెలియజేసిన విషయాన్ని రమేశ్ తరఫు న్యాయవాది వై రామారా వు హైకోర్టు దృష్టికి తెచ్చారు. తన పౌరసత్వాన్ని కేంద్రం చట్ట వ్యతిరేకంగా రద్దు చేసిందంటూ రమేశ్ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బీ విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ జరిపారు. జర్మన్ పౌరసత్వాన్ని రమేశ్ వదులుకున్నట్టు మెమో దాఖలు చేశామని న్యాయవాది వివరించారు. కేంద్ర హోం శాఖ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ నరసింహశర్మ వాదనలు వినిపిస్తూ, రమేశ్ 2033 వరకు చెల్లుబాటయ్యేలా పాస్‌పోర్టును పునరుద్ధరించుకున్నారని తెలిపారు. ఇదే విషయంపై గతంలో ఫి ర్యాదు చేసిన ఆది శ్రీనివాస్ (ప్రస్తుతం ఎమ్మెల్యే) తరఫు న్యాయవాది రవికిరణ్‌రావు వాదిస్తూ, జర్మన్ దేశ పౌరుడు కాకుండా పాస్‌పోర్టు పొందలేరని చెప్పారు. తీర్పును రిజర్వులో పెడుతున్నట్టు న్యాయమూర్తి ప్రకటించారు.