హైదరాబాద్, ఆగస్టు 2 (నమస్తే తెలంగాణ): ఎట్టకేలకు హోంగార్డుల బాధలు ప్రభుత్వం దృష్టికి చేరాయి. జూలై 30 నుంచే హోంగార్డులకు వేతనాలు జమ అవుతున్నాయి. రెండు కమిషనరేట్ల పరిధిలో హోంగార్డులకు మినహా.. అందరికీ వేతనాలు పడ్డాయి. హోంశాఖలో పనిచేస్తు న్న తమ కష్టాలను రేవంత్‌రెడ్డి ప్రభుత్వం 18 నెలలకు గుర్తించిందని హోంగార్డులు చెప్తున్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర్నుంచి.. ప్రతినెల 10 నుంచి 20వ తేదీ మధ్యలో ఆలస్యంగా వేతనాలు వేస్తున్నది. దీంతో హోంగార్డులు కుటుంబపోషణకు తీవ్ర ఇబ్బందులు పడేవారు. దీనిపై ‘నమస్తే తెలంగాణ’ ప్రతినెల కథనాలు ప్రచురించింది. ‘నమస్తే తెలంగాణ’ రాసిన కథనాల ఆధారంగా హోంగార్డులకు మద్దతుగా మాజీ మంత్రి హరీశ్‌రావు ఓ ప్రకటన విడుదల చేశారు. హోంగార్డులు ప్రతినెల పడుతున్న కష్టాలను వివరించారు.
ప్రభుత్వం స్పందించకపోతే హోంగార్డులందరినీ కూడగట్టుకొని ఆందోళనలు చేస్తామని హెచ్చరించారు. దీంతో 8 జిల్లాలు/యూనిట్ల హోంగార్డులకు ఈ నెల మొదటి రెండు రోజుల్లోనే వేతనాలు వేశారు. పోలీసులకు ఒకటో తారీకు వేతనం అందుతుండగా.. హోంగార్డులకు ప్రతినెల చెక్ బౌన్సులు అవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల ఫీజులు కట్టలేక నరకయాతన అనుభవిస్తున్నామని, ఇంటి రెంట్లకు ఇబ్బందులు వస్తున్నాయని తమ బాధ ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని అంటున్నారు. ప్రభుత్వం దయతో ప్రతినెల అందరికీ ఒకేసారి వేతనాలు వేయాలని కోరుతున్నారు.