Home Guards | హైదరాబాద్, డిసెంబర్ 12 (నమస్తే తెలంగాణ) : సకాలంలో వేతనాలు రాక హోంగార్డులు ఆర్థికఇబ్బందులు పడుతున్నారు. ఈ నెల వేతనం కోసం 12 రోజులుగా ఎదురుచూసినా ఫలితం లేకపోవడంతో తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రతినెలా జీతం ఆలస్యం అవుతుండటంతో కుటుంబం గడువడం కష్టంగా మారిందని చెప్తున్నారు. చెక్‌బౌన్స్‌లు అవుతున్నాయని, ఈఎంఐ డేట్లు ముగిసి సిబిల్ స్కోర్ పడిపోతుందని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. పిల్లల స్కూల్ ఫీజులు, ఇంటి ఖర్చులు, అద్దెలు, పెట్రోల్ అవసరాలకు డబ్బులు సర్దడం కష్టంగా మారిందని వాపోతున్నారు. బీఆర్ఎస్ హయాంలో ప్రతినెలా 1, 2 తారీకుల్లో వేతనాలు పడుతుంటే ఇబ్బందులు లేకపోయేవని పేర్కొంటున్నారు. 5వ తారీకులోగా చెల్లించాలని కోరుతున్నారు.
ఇబ్రహీంపట్నం రూరల్, డిసెంబర్ 12 : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం సీఐపై బదిలీ వేటుపడింది. ఈనెల 2న ఇబ్రహీంపట్నం మండలం రాయపోల్ సమీపంలో సొంత తమ్ముడి చేతిలో మహిళా కానిస్టేబుల్ నాగమణి దారుణంగా హత్యకు గురైన విషయం తెల్సిందే. ఈ కేసు విషయంలో సీఐ సత్యనారాయణ నిర్లక్ష్యంగా వ్యవహరించాడని ఆయన్ను కమిషనరేట్‌కు అటాచ్ చేస్తూ గురువారం రాచకొండ సీపీ సుధీర్‌బాబు ఉత్తర్వులు జారీ చేశారు. కాగా నాగమణి హత్యకేసులో నిందితుడిగా ఉన్న అచ్చన శివను గురువారం అరెస్టుచేసి రిమాండ్‌కు తరలించినట్టు ఇబ్రహీంపట్నం పోలీసులు తెలిపారు.