హైదరాబాద్, జూన్ 17 (నమస్తే తెలంగాణ): రొటేషన్ పద్ధతిలో బలవంతంగా చేస్తున్న బదిలీలతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని హోంగార్డులు వాపోతున్నారు. ఏటా కమిషనరేట్లు, ఉమ్మడి జిల్లాలవారీగా జరుగుతున్న ఈ బదిలీలతో కుటుంబాలు తీవ్ర ఇబ్బందు లు పడుతున్నాయని చెప్తున్నారు. ఖమ్మం జిల్లా నుంచి భద్రాద్రి, కరీంనగర్ కమిషనరేట్ నుంచి సిద్దిపేట, వరంగల్, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలకు, నిజామాబాద్ కమిషనరేట్ నుంచి కామారెడ్డికి, ఆదిలాబాద్ నుంచి నిర్మల్, ఆసిఫాబాద్ జిల్లాలకు, మహబూబ్నగర్ నుంచి వనపర్తి, గద్వాల, నారాయణపేటకు, నల్లగొండ నుంచి సూర్యాపేట, యాదాద్రి జిల్లాలకు.. ఇలా ఏటా పంపుతున్నారని అంటున్నారు.
ఆర్డర్ టు సర్వ్ ద్వారా రొటేషన్ పద్ధతిలో బదిలీ అవుతున్న హోంగార్డులు వందకుపైగా కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి వస్తున్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బదిలీలు చేయడం అన్యాయమని, రాష్ట్రంలో భారీగా పోలీస్ ఉద్యోగాలకు నియామకాలు చేపట్టిన తర్వాత కూడా సిబ్బంది తక్కువగా ఉన్నారంటూ హోం గార్డులను బదిలీ చేయడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తున్నారు.
చాలీచాలని వేతనాలతో కుటుంబాలు పోషించుకోలేని దుర్భరస్థితిలో ఉన్నామని హోంగార్డులు చెప్తున్నారు. బలవంతంగా బదిలీ చేస్తున్నారని, లే దంటే ఉద్యోగంలోంచి తీసేస్తామని బెదిరిస్తున్నారని వాపోతున్నారు. ప్రతి ఏటా జూన్ రాగానే హోంగార్డులు ఆందోళనకు గురవుతున్నారని, బదిలీల గురించి ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందోనని ఆందోళనతో కాలం గడుపుతున్నారని అంటున్నారు. సంచారజాతుల వారిలా తట్టాబుట్ట సర్దుకొని ఇతర జిల్లాలకు వెళ్లి ఉద్యోగం చేయడం శక్తికి మించిన భారంగా ఉన్నదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఒకేచోట స్థిరంగా ఉండలేకపోవడంతో బిడ్డల చదువులకు తీవ్ర ఇబ్బందులు వస్తున్నాయని చెప్తున్నారు.
సుదూరప్రాంతానికి చేసే ప్రయాణ ఖర్చులు సైతం వేతనం నుంచే కట్ అవుతున్నాయని, సగం వేతనం ప్రయాణానికి కేటాయించాల్సి వస్తున్నదని అంటున్నారు. మిగిలిన డబ్బులతో కుటుంబపోషణ భారం కావడంతో ఇంటి అద్దె, పిల్లల చదువులు, అనారోగ్య సమస్యల గురించి అప్పులు చేస్తున్నామని చెప్తున్నారు. ఈ ఇబ్బందులకు తోడు ఇప్పటికే రావాల్సిన యూనిఫామ్ అలవెన్స్ ఇంకా రాలేదని, పరేడ్ అలవెన్స్ కూడా ఏడాది నుంచి తమ ఖాతాలో జమ కావడంలేదని ఆందోళన చెందుతున్నారు. మరణించిన హోంగార్డుల కుటుంబాలకు పరిహారం, కారుణ్య నియామకాలు వంటి ఎన్నో సమస్యలతో కొట్టుమిట్టాడుతున్నామని.. తమ సమస్యలకు ఉన్నతాధికారులు శాశ్వత పరిష్కారం చూపాలని, బలవంతపు బదిలీలను ఆపాలని వేడుకుంటున్నారు.