జయశంకర్ భూపాలపల్లి, జనవరి 26 (నమస్తే తెలంగాణ): ఇరవై ఏండ్లుగా పోలీస్ శాఖలో చాలీచాలని వేతనంతో 24 గంటలు సేవలందించిన హోంగార్డు ఇప్పుడు అంపశయ్యపై ఉన్నాడు. రెండేండ్లుగా క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్నాడు. అప్పులు చేసి వైద్యం చేయించుకుంటున్నాడు. భార్యాభర్తలు, ఇద్దరు పిల్లలు మినహా వాళ్లకు నా అనే వాళ్లు లేరు. ఆస్తిపాస్తులు లేవు. సొంత డిపార్టుమెంట్ సహకారం ఇంతవరకూ అందలేదు. క్యాన్సర్‌తో బాధపడుతూనే విధులు నిర్వర్తించాడు. రెండు నెలలుగా అతడి పరిస్థితి విషమించింది.
చికిత్స చేసుకోవడానికి ఆర్థిక స్తోమత లేక ఇంటికే పరిమితమయ్యాడు. అటు భార్యకు అనారోగ్యం.. ఇటు భర్తకు క్యాన్సర్… ఇద్దరు ఆడపిల్లలు.. చిన్నబిడ్డకు మూడేండ్లు.. అద్దె ఇంట్లో జీవనం గడుపుతున్న ఆ కుటుంబం… క్లిష్ట పరిస్థితుల్లో చాలా దీనంగా చేయూత కోసం ఎదురుచూస్తున్నది. జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని రాజీవ్‌నగర్‌లో ఉంటున్న మామిడాల శంకర్ అనే హోంగార్డు దీన పరిస్థితి ఇది. ప్రభుత్వం, పోలీస్ శాఖ ఆదరణ కరువై మృత్యువుతో పోరాడుతున్నాడు. మానవీయ కోణంలో ఎంతోమందికి సహాయం చేస్తున్న పోలీస్ శాఖ శంకర్ విషయంలో ఎందుకో పట్టనట్టుగా వ్యవహరిస్తున్నది. సొంతశాఖ పట్టనట్టు వ్యవహరిస్తే మాకు దిక్కెవరు? అని ఆ కుటుంబం రోదిస్తున్నది.
గణపురం మండలం లక్ష్మారెడ్డిపల్లి గ్రామానికి చెందిన మామిడాల శంకర్ భూపాలపల్లి పోలీస్‌స్టేషన్‌లో హోంగార్డుగా పనిచేస్తున్నాడు. అతడికి తల్లిదండ్రులు, అన్నదమ్ములు ఎవరూ లేరు. భార్యకూ తల్లిదండ్రులు లేరు. ఉన్న ఒక్క అన్నయ్య చనిపోయాడు. ఇద్దరికీ నా అన్నవాళ్లు లేక శంకర్ చేసే హోంగార్డు ఉద్యోగంపైనే జీవనం గడుపుతున్నారు. క్యాన్సర్ మహమ్మారి ఆ కుటుంబాన్ని ఛిన్నాభిన్నం చేసింది. రెండేండ్ల క్రితం శంకర్‌కు క్యాన్సర్ సోకడంతో ఆరోగ్యశ్రీ కింద ఆపరేషన్ చేయించుకున్నారు. మళ్లీ ఆపరేషన్‌కు ఆరోగ్యశ్రీ కింద అవకాశం లేకపోవడంతో అప్పులు చేసి చికిత్స పొందుతున్నాడు. వారానికి ఐదు రోజులు హైదరాబాద్‌లో రేడియేషన్ చేయించుకుంటూ గాలిలో దీపంలా ప్రాణాలు నిలబెట్టుకుంటున్నాడు. శంకర్‌కు భార్య విజయలక్ష్మి, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. పెద్దకూతురు లక్ష్మీసువిధ డిగ్రీ రెండో సంవత్సరం చదువుతుండగా, చిన్న కూతురు లక్ష్మీఅవంతికకు మూడేండ్లు. ఇద్దరు కూతుళ్ల పరిస్థితి ఏమిటని శంకర్ భార్య విలపిస్తున్నది.
నాకు ఇద్దరు ఆడపిల్లలు. మాకు వేరే ఆధారం లేదు. నా భర్తకు, నాకు తల్లిదండ్రులు లేరు. మాకు ఇతర ఆస్తులు లేవు. ఆయన హోంగార్డు ఉద్యోగం చేస్తేనే మాకు బతుకు. ఇప్పుడు ఆయనకు క్యాన్సర్. ఆరోగ్యశ్రీపై చికిత్సలు చేయించిన. ఇప్పుడు చికిత్సలకు అప్పులు చేస్తున్నా. అప్పులు ఎలా తీర్చాలి. ఇద్దరు ఆడపిల్లల పరిస్థితి ఏమిటి? రెండేండ్లుగా క్యాన్సర్‌తో బాధపడుతున్నాడు. రెండు నెలలుగా పూర్తిగా ఆరోగ్యం క్షీణించింది. డ్యూటీకి వెళ్లడం లేదు. ఇంట్లో పూటగడవడం లేదు. నాకు కుడిచేయి పనిచేయదు. అన్నం కూడా ఎడమచేత్తో తింటాను. గుండె సమస్య ఉంటే డబ్బులు లేక చికిత్స చేయించుకుంటలేను. ఇప్పటివరకు పోలీసు అధికారులు ఎలాంటి సహకారం అందించడం లేదు. అప్పుడు ఎస్పీ సురేందర్‌రెడ్డి దగ్గరికి మా ఆయనను తీసుకుని వెళ్లి కలిసిన. పట్టించుకోలేదు. దయచేసి మా ఆయనను బతికించండి. మా కుటుంబాన్ని నిలబెట్టండి.
– విజయలక్ష్మి, శంకర్ భార్య