హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ): ‘మాట తప్పను, మడమ తిప్పను’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పే మాటలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. రాజకీయ ప్రయోజనాల కోసం రేవంత్‌రెడ్డి ఇచ్చే హామీలన్నీ ఊకదంపుడు ఉపన్యాసాలేనని, ఆయన మాటమీద నిలబడే రకం కాదని హోంగార్డు రవీందర్ విషయంలో మరోసారి రుజువైంది. గతంలో రేవంత్‌రెడ్డి పీసీసీ చీఫ్‌గా ఉన్నప్పు డు రవీందర్ ఆత్మాహుతిని రాజకీయంగా వాడుకున్నారు. రవీందర్ కుటుంబానికి రూ.25 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని, ఆయన భార్యకు ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని, వారి ఇద్దరు కుమారుల ఉన్నత చదువులకు సాయం అందజేయాలని అసెంబ్లీ ఎన్నికల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశా రు. లేకపోతే వారి బాధ్యతను తానే తీసుకుంటానని హామీ ఇచ్చారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే 100 రోజుల్లోగా రవీందర్ కుటుంబానికి పరిహారం చెల్లించడంతోపాటు హోంగార్డులను పర్మినెంట్ చేస్తామని ఊదరగొట్టారు. తీరా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక రవీందర్ కుటుంబాన్ని గాలికి వదిలేశారు. రెండేండ్లు దాటినా ఆ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కాదుకదా కనీసం హోంగార్డు ఉద్యోగాన్ని కూడా ఇవ్వలేకపోయారు. దీంతో రవీందర్ భార్య సంధ్య తన ఇద్దరు బిడ్డలను చదివించుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు.
ఇల్లు గడవడమే గగనమైనా ఇద్దరు బిడ్డల్లో ఒకరిని చదివిస్తూనే పార్ట్‌టైమ్ ఉద్యోగానికి పంపుతున్నారు. రవీందర్ చనిపోయిన నాటినుంచి తమ గోడును ఎవరూ పట్టించుకోలేదని, రేవంత్‌రెడ్డి ఇచ్చిన హామీలను తల్చుకుంటూ ఏడ్వని రోజే లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పిల్లల చదువులకు ఫీజులు కట్టలేక రవీందర్ ఐడీ కార్డులు, వినతిపత్రాలు పట్టుకొని మంత్రుల కాళ్లావేళ్లా పడుతున్నా ఎవరూ కనికరించడం లేదని, సీఎం అపాయింట్మెంట్ కోసం చెప్పులరిగేలా తిరుగుతున్నామని భోరున విలపిస్తున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హోంగార్డు కుటుంబసభ్యులకు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు ఇస్తామని రవీందర్ మృతదేహం సాక్షిగా చెప్పిన రేవంత్‌రెడ్డి.. తీరా ముఖ్యమంత్రి అయ్యాక పోలీసుశాఖలో కారుణ్య నియామకాలను రద్దు చేయించారు. ఇటీవల ట్యాంక్‌బండ్ శివ కుమారునికి ఆగమేఘాల మీద ఒక్కరోజులో నియామక ప త్రం ఇచ్చిన సీఎం, తమకు కారుణ్య ఉద్యోగాలు ఎప్పుడు ఇస్తారని ఇతర హోంగార్డుల కుటుంబసభ్యులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రే తమకు అన్యాయం చేస్తే ఇంకెవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఇప్పటికైనా కారుణ్య నియామకాలు చేపట్టి తమకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని వేడుకుంటున్నారు.
‘ట్యాంక్‌బండ్ శివ కుమారుడికి సీఎం ఇటీవల హోంగార్డు ఉద్యోగం ఇప్పించారు. అది సంతోషదాయకమే. అయితే భర్తను, ఆయన ఉద్యోగాన్ని కోల్పోయి నేనేం తప్పు చేశాను?’ అని సంధ్య కన్నీటి పర్యంతమవుతున్నారు. ఉస్మానియా దవాఖానలో రేవంత్‌రెడ్డి తన పక్కనే కూర్చొని ఓదార్చినప్పుడు కొండంత అండగా ఉన్నాడని ధైర్యంగా ఉన్నానని, ఆ ఆశలు అనతి కాలంలోనే నీరుగారాయని వాపోయారు. ‘నాడు రేవంతన్న ఇస్తానన్న ప్రభుత్వ ఉద్యోగం, రూ.25 లక్షల పరిహారం ఏమయ్యాయో తెలియదు. పిల్ల ల చదువుకు ఆర్థిక సాయం అందిస్తామని ఇచ్చిన భరోసా నీటిమూటగానే మిగిలింది. మా కుటుం బం ఆర్థిక ఇబ్బందుల్లో కూరుకుపోయింది. కుటుంబ పోషణకు నా పెద్ద కొడుకు డిగ్రీ చదువుతూనే పార్ట్‌టైమ్ ఉద్యోగం చేస్తున్నాడు. అతనికైనా ప్రభుత్వ ఉద్యోగం ఇప్పించండి రేవంతన్నా’ అంటూ వేడుకుంటున్నారు.