మిరుదొడ్డి, మే 1 : లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన హోంగార్డును రిమాండ్‌కు తరలించిన ఘటన సిద్దిపేట జిల్లా మిరుదొడ్డి పోలీస్ స్టేషన్లో గురువారం జరిగింది. ఏసీబీ డీఎస్పీ సుదర్శన్ తెలిపిన వివరాల ప్రకారం.. హైదరాబాద్‌కు చెందిన అమీర్ వ్యక్తిగత పనులపై సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపల్ పరిధిలోని లచ్చపేట నుంచి మిరుదొడ్డి మీదుగా హైదరాబాద్‌కు బైక్‌పై వెళ్తున్నాడు. ఈక్రమంలో మిరుదొడ్డి టౌన్ శివారులో బైక్ అదుపుతప్పి మిరుదొడ్డికి చెందిన రాజు వాహనాన్ని ఢీకొన్నది.
దీనిపై రాజు మిరుదొడ్డి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా.. హోంగార్డు సంతోష్ వ్యవహారం సర్దుబాటు చేస్తానని తెలిపాడు. ఇందుకు రూ.15 వేలు లంచం ఇవ్వాలని అమీర్‌ను డిమాండ్ చేయడంతో ఇద్దరి మధ్య రూ.10 వేలకు ఒప్పందం కుదిరింది. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. ఒప్పందం ప్రకారం హోంగార్డు సంతోష్ రూ.2 వేలు తీసుకున్నాడు. హోటల్ యజమాని శేఖర్‌కు రూ.2 వేలు, వైన్స్ దుకాణానికి చెందిన రాజుకు రూ.3 వేలు ఇవ్వాలని తెలిపాడు. బాధితుడు తెలిపిన వివరాలతో ముగ్గురిని ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకొని విచారణచేసి హోంగార్డు సంతోష్‌పై కేసు నమోదుచేశారు.