మంగళవారం 07 ఏప్రిల్ 2020
Telangana - Mar 23, 2020 , 21:32:37

రాజన్న ఆలయంలో ఘనంగా హోమాలు

రాజన్న ఆలయంలో ఘనంగా హోమాలు

వేములవాడ  : కరోనా వైరస్‌ నివారణార్థం, లోక కల్యాణార్థం వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామివారి దేవస్థానంలో సోమవారం హోమాలు నిర్వహించారు. దేవాదాయశాఖ అధికారుల ఆదేశాలమేరకు రాజన్న ఆలయ కల్యాణ మండపంలో మహామృత్యుంజయ, సుదర్శన, ధన్వంతరి హోమాలను ఆలయ అర్చకులు ఘనంగా నిర్వహించారు. దీంతో ఆలయ పరిసరాలు వేదమంత్రాలతో మార్మోగాయి. ఉదయం 5 గంటలకు శ్రీపార్వతీ రాజరాజేశ్వర స్వామికి ప్రాతఃకాల పూజ అనంతరం ఆలయ కల్యాణ మండపంలో స్థానాచార్యులు అప్పాల భీమాశంకర్‌ ఆధ్వర్యంలో అర్చకులు గణపతిపూజ, రుత్విక్‌ వరణం, ఫుణ్యాహవాచనం, పంచగవ్య మిశ్రణం, మండపారాధన, కలశ స్థాపన, నవగ్రహ అష్టదిక్పాలక పూజ, మాతృకా పూజ, వాస్తు పూజ, క్షేత్రపాలక పూజ, మహా మృత్యుంజయ, ధన్వంతరి, సుదర్శన ఆవాహన పూజలు, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలను అర్చకులు ఘనంగా నిర్వహించారు.

హోమ కార్యక్రమంలో జపానుష్టానాలు, ఆవాహితా దేవాతా హోమం, చతుర్వేద హవనం, సూర్యనారాయణ హవనం, మహామృత్యుంజయ సంపుటీకరణ రుద్రహవనం, ధన్వంతరీ హవనం, సుదర్శన హవనం వైభవంగా నిర్వహించారు. పూర్ణాహుతి అనంతరం మహామృత్యుంజయ కలశ జలాన్ని మంగళవాయిద్యాల మధ్య ఆలయంలో ప్రదక్షిణా పూర్వకంగా తిరిగి శ్రీ రాజరాజేశ్వర స్వామికి సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఆలయ ప్రధానార్చకులు ఈశ్వర గారి సురేశ్‌, నమిలకొండ ఉమేశ్‌, నమిలకొండ రాజేశ్వర శర్మ, గోపన్నగారి నాగన్న, శివుడు, గణేశ్‌, దుమాల వాసు, మధు హరీష్‌, గర్శకుర్తి శ్రీధర శర్మ, ఒజ్జల ఆదిత్య, కేశన్నగారి కృపాల్‌, బుడెంగారి రాజు, ఆలయ పర్యవేక్షకులు నాగుల మహేశ్‌, ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌, భూపతిరెడ్డి, భాస్కర్‌, పూజల ఇన్‌చార్జి గట్టు గౌతమ్‌, తదితరులు పాల్గొన్నారు. 



logo