హైదరాబాద్, మే 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర ఇంటర్మీడియట్ విద్యామండలి వెలువరించిన వార్షిక క్యాలెండర్ మేరకు ప్రైవేటు కాలేజీలకు సెలవులు ప్రకటించేలా ఉత్తర్వులు ఇవ్వాలంటూ బందెల క్రాంతికుమార్ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. ఆదివారాలు, ప్రభుత్వ సెలవు రోజులనే తారతమ్యం లేకుండా పలు ప్రైవేట్ కాలేజీలు ఫిజికల్‌గా, వర్చువల్‌గా విద్యార్థులతో క్లాస్‌లు నిర్వహిస్తున్నారని పిటిషనర్ తరఫు న్యాయవాది సీఆర్ సుకుమార్ పిల్లో పేరొన్నారు. వేసవి సెలవుల్లో తరగతులు నిర్వహించకుండా ఉత్తర్వులు ఇవ్వాలని, ఇప్పటికే జరుగుతున్న తరగతులను ఆపివేసేలా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని కోరారు. ప్రైవేట్ కాలేజీల పనితీరును బేరీజు వేసేందుకు తనిఖీలు చేయాలనే నిబంధనలను అధికారులు విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిల్‌ను బుధవారం హైకోర్టు విచారణ చేపట్టే అవకాశం ఉంది.
టీసీఎస్ ఉద్యోగులకు 100% వేరియబుల్ పే
ముంబై, మే 6: దేశీయ ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులకు 100 శాతం వేరియబుల్ చెల్లింపులు జరిపింది. గడిచిన త్రైమాసికానికిగాను అంచనాలకుమించి రాణించిన ఉద్యోగులకు సంస్థ అదనపు ప్రయోజనాలు కల్పించింది. దీంట్లోభాగంగానే మార్చి త్రైమాసికానికిగాను 70 శాతం మంది ఉద్యోగులకు వేరియబుల్ చెల్లింపులు జరిపినట్టు సంస్థ బీఎస్ఈకి సమాచారం అందించింది. ప్రస్తుతం సంస్థలో ఆరు లక్షలకుపైగా ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు.