హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): ‘ఊర్లను అభివృద్ధి చేయాలన్న ఆకాంక్షతో సొంతంగా డబ్బులు ఖర్చుపెట్టి పనులు చేయించినం. పెండింగ్ బిల్లుల విషయంలో ప్రభుత్వానికి ఎన్నిసార్లు వినతి పత్రాలు ఇచ్చినా స్పందించడం లేదు. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నం. మీరైనా స్పందించి బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించండి’ అని ఎన్నికల కమిషనర్ పార్థసారథిని రాష్ట్ర సర్పంచ్ల సంఘం కోరింది. ఈ మేరకు బుధవారం మాసబ్‌ట్యాంక్‌లోని తెలంగాణ ఎన్నికల సంఘం కార్యాలయంలో కమిషనర్‌కు వినతిపత్రం అందజేసింది. ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గూడూరు లక్ష్మీనర్సింహారెడ్డి, జేఏసీ కమిటీ అధ్యక్షుడు సుర్వి యాదయ్య గౌడ్ మాట్లాడుతూ వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, రైతు వేదికలు, డంపింగ్ యార్డులు, సీసీ రోడ్లు, క్రీడా ప్రాంగణాలు, అంతర్గత మురుగు కాల్వలు, వీధిలైట్లు, పారిశుధ్య నిర్వహణ తదితర కార్యక్రమాలను విడతల వారీగా చేపట్టి గ్రామాలను ఆదర్శవంతంగా తీర్చిదిద్దామని, పెండింగ్ బిల్లులు అడిగితే రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోవడం లేదని చెప్పారు.
తెలంగాణ వ్యాప్తంగా ఎన్నో అభివృద్ధి పనులు చేశామని, నేటికీ బిల్లులు రాక ఆర్థికంగా నానా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తంచేశారు. ఎంతో కష్టపడి గ్రామాలను అభివృద్ధి పథంలోకి తీసుకెళ్లిన సర్పంచులను బిల్లుల చెల్లింపులో జాప్యం చేస్తూ కష్టపెట్టొద్దని కోరారు. సర్పంచ్‌లకు పెండింగ్ బిల్లులు చెల్లించాకే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి ప్రనీల్ చందర్, ఉపాధ్యక్షుడు గుంటి మధుసూదన్‌రెడ్డి, అమరేందర్‌రెడ్డి, సముద్రాల రమేశ్, పంబ కరుణాకర్, రామకృష్ణ, శ్రీనివాస్ పాల్గొన్నారు.