హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): సిద్దిపేట జిల్లా తోటపల్లిలో కాకతీయ గణపతిదేవుడి శిల్పాన్ని గుర్తించినట్టు పురావస్తు పరిశోధకుడు, ప్లీచ్ ఇండియా ఫౌండేషన్ సీఈవో ఈమని శివనాగిరెడ్డి, కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. పురాతన స్థలాలు, చారిత్రక, వారసత్వ కట్టడాలపై గ్రామీణులకు అవగాహన కల్పించడంలో భాగంగా ఆదివారం సిద్దిపేట జిల్లాలోని నంగునూరు, కొండపాక, తోటపల్లి, లకుడారం గ్రామాలను సందర్శించారు. ఈ పర్యటనలో భాగంగా బెజ్జంకి మండలం తోటపల్లిలోని కాకతీయుల కాలంనాటి శివాలయం రంగ మండపంలోని శిల్పం ముమ్మాటికీ గణపతిదేవుడు, ఆయన సతీమణి సోమలదేవి, రాజగురువు విశ్వేశ్వర శివాచార్యులదేనని వెల్లడించారు.
రాజగురువు సమక్షంలో శివదీక్ష తీసుకున్న గణపతిదేవుడు రాచరికపు చిహ్నాలను పక్కనబెట్టి తలపై శిఖ, ఒంటిపై రుద్రాక్ష మాలలు ధరించి శివలింగానికి పుష్పాభిషేకం చేస్తుండగా ద్రవిడ తమ్మిళ్ల కేశాలంకరణతో సోమలదేవి పూజలో నిమగ్నమైనట్టు, చక్రవర్తికి కుడివైపున రాజగురువు గోళకి మఠాధిపతి విశ్వేశ్వర శివాచార్యుడు వారితో పూజులు చేయిస్తున్నట్టు ఉన్నారని పేర్కొన్నారు.
తెలంగాణలో ఇదే తొలి పురాతన శిల్పమని వెల్లడించారు. చారిత్రక ప్రాధాన్యత కలిగిన ఈ అంశాన్ని తెలుగు పాఠ్యంశాల్లో చేర్చాలని ప్రభుత్వానికి విజ్ఞప్తిచేశారు. కార్యక్రమంలో వారసత్వ ప్రేమికుడు, లాంకో హిల్స్ ఎండీ అండ్ సీఈవో సింహాద్రి వెంకట్రామారెడ్డి, ఆలయ పూజారులు కైలాసపతి, కవిత, కొత్త తెలంగాణ చరిత్ర బృందం సభ్యులు అహోబిలం కరుణాకర్, సామలేటి మహేశ్, గ్రామస్తులు పాల్గొన్నారు.