హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చ్ 25(నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖ ‘గోవింద’మయమైంది. అక్కడ ఎంత పెద్ద అధికారులు ఉన్నా.. చిన్న ఉద్యోగి నుంచి పెద్ద అధికారి వరకూ ఆ కీలక వ్యక్తిని కలువాల్సిందే! ఆయనను ప్రసన్నం చేసుకోవాల్సిందే. ఒకవేళ ఆయన కంటిచూపు పడకుండా ఏదైనా చేయాలనుకుంటే, ఆ అధికారికి ఎక్కడో ఒక దగ్గర తెలియకుండానే దెబ్బపడుతుందట.
తీయగా మాట్లాడుతూ తనకు కావలసిన పనులు చేసుకుంటూ తనకు అర్హతలు లేకున్నా.. శాస్ర్తాలు తెలియకున్నా.. తనకున్న అరవ పరిచయాలను తెలంగాణ ధార్మిక వ్యవస్థపై రుద్దుతూ పక్కదారి పట్టిస్తూ దేవాదాయ శాఖలో రాజ్యాంగేతర శక్తిగా కొనసాగుతున్న ఆ వ్యక్తి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వరాష్ట్రం సాధించుకుని సంతోషంగా ఉండాలనుకున్న నేలపై తమిళనాడుకు చెందిన వ్యక్తిని దేవాదాయ శాఖలో కీలకమైన పదవిలో కూర్చుండబెట్టి తెలంగాణ ధార్మికలోకాన్ని చిన్నచూపు చూసిన కాంగ్రెస్ సర్కార్‌పై దేవాలయాల వ్యవస్థతో ముడిపడి ఉన్న ప్రతి ఒక్కరూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
తమిళనాడు, తెలంగాణ రాష్ర్టాల సంస్కృతీ సంప్రదాయాలు, ఆగమ వ్యవహారాలు పూర్తిగా విభిన్నంగా ఉంటాయని, అయితే, తమిళ వ్యవహారాన్ని తెలంగాణ దేవాలయాల్లో జొప్పించడానికి ఆ సలహాదారు ప్రయత్నిస్తున్నారంటూ ధార్మికవేత్తలు మండిపడుతున్నారు. జాతరలు, పండుగల్లో ప్రత్యేక ఆహ్వానితుడుగా ఉండటమే కాకుండా ఆలయాల అభివృద్ధికి సూచనలిచ్చేలా, శాఖాపరమైన ముఖ్య నిర్ణయాల్లో కీలకంగా వ్యవహరించేలా అధికారాలు కల్పించడంతో ఆయన ఆగడాలకు అంతులేకుండా పోతున్నది.
ఎవరైనా తన మాట వినని పక్షాన వారిని ఏదో ఒకరకంగా ఇబ్బందులు పెడుతున్నారని ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే, చాలామంది ఉద్యోగుల్లో ఈ సలహాదారు దగ్గరకు వెళ్తేనే తమ పని అవుతుందన్న సంకేతాలు బలంగా ఆ శాఖలో క్షేత్రస్థాయిలో పంపించడంలో సలహాదారు సక్సెసయ్యారని, కొన్ని దేవాలయాల్లో సూపరింటెండెంట్లు ఈయనకు ఏజెంట్లుగా పనిచేస్తున్నారని ఆ శాఖలో చెప్పుకుంటున్నారు. దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో ఒక కీలక అధికారి కూడా ఆయనతో సన్నిహితంగా ఉంటూ తన పనులు చేసుకొంటున్నారని, ఉద్యోగులెవరైనా పనులు ఉన్నాయని వస్తే సలహాదారును కలిస్తే పనైపోతుందనే సంకేతాలు ఇస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి.
రాష్ట్రంలో మతపరమైన ఉద్యోగుల నియామకానికి సంబంధించి పరీక్షలు జరుగుతున్నాయి. కొన్ని పరీక్షలు దేవాలయాల్లోనూ, మరికొన్ని దేవాదాయ శాఖ కార్యాలయంలోనూ నిర్వహిస్తున్నారు. పలు దేవాలయాల్లో వివిధ ఆగమాలు, వేదాలకు సంబంధించిన పండితుల నియామకాలకు ఉద్దేశించిన ఎంపిక కమిటీల్లో తెలంగాణ వారికి చోటు దక్కకపోవడానికి ఈ కీలక సలహాదారుతోపాటు ఆయనకు వంత పాడుతున్న మరో వ్యక్తి కారణమని దేవాదాయ శాఖలో వేదపండితులు చర్చించుకుంటున్నారు.
తెలంగాణలో పుట్టి పెరిగి ఇక్కడే వేదపండితులుగా మన్ననలు పొందుతున్నవారెందరో ఉండగా వారిని కాదని వేర్వేరు ప్రాంతాలకు చెందిన వారిని కమిటీలో పెట్టి వారి ద్వారా ఈ పోస్టులకు సంబంధించిన లావాదేవీలు కొనసాగిస్తున్నారన్న చర్చ జరుగుతున్నది. ఈ వ్యవహారంలో ఆరోపణలు రావడంతో జిల్లా స్థాయిలో కమిటీలు వేద్దామంటూ దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు ప్రతిపాదనలు పెడితే అక్కడ కూడా తనవారిని ఒకరిని నియమిస్తూ మిగతావారిని జిల్లాకు చెందిన వారికి అవకాశమివ్వాలని ఈ కీలక వ్యక్తి ప్రతిపాదించారని తెలిసింది.
ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు మరో రెండుమూడు రోజుల్లో బయటకు వచ్చే అవకాశాలున్నాయని తెలిసింది. జిల్లాల వారీగా తనకు సంబంధించిన వేదపండితులతో నియామకాల్లో వ్యవహారాలు నడిపించడానికి ఆ కీలక సలహాదారు చేసిన ప్లాన్‌గా దేవాదాయ ఉద్యోగులు చెప్పుకుంటున్నారు. ఇదిలాఉంటే, దేవాలయాల్లో ఆగమాలపై ఈ సలహాదారు మాటలే శిలాశాసనంలా ఉండాలంటూ మౌఖికంగా ఆదేశాలు వచ్చాయట. శైవాగమం ఉండాల్సిన చోట వేరొక ఆగమానికి చోటు కల్పిస్తూ చేసిన ఒకట్రెండు వ్యవహారాలు ప్రస్తుతం అంతర్గతంగా చర్చకు దారితీశాయి. మరోవైపు, ధర్మవాణిలో ఆగమాలు కానీ, ఇతర వేదపండితులకు సంబంధించిన ఏ దరఖాస్తు వచ్చినా ఈ సలహాదారు దగ్గరికి వెళ్లి ఆయన చూపు పడిన తర్వాతే ఆయన ప్రసన్నమైతేనే ఆ పని జరుగుతుందనే చర్చ జరుగుతున్నది.
దేవాదాయ శాఖకు సంబంధించి బంగారం తయారీ పనులు, ఆలయ నిర్మాణ పనుల్లో ఆయనదే కీలకపాత్రగా ఆ శాఖలో చర్చ జరుగుతున్నది. జోగుళాంబ, బాసర, వేములవాడ, కాళేశ్వరం తదితర ఆలయాల్లో జరుగుతున్న కోట్లాది రూపాయల పునరుద్ధరణ పనుల్లో ఈయనగారిదే పెత్తనమని, ఆయన ఎలా చెప్తే అలాగే చేయాలంటున్నారు ఆ శాఖకు సంబంధించిన ఇంజినీర్లు. గతంలో ఏ ఆలయ నిర్మాణానికైనా స్థపతి ఎలా చెప్తే అలా జరిగేది కాగా ఈ సలహాదారు వచ్చినప్పటి నుంచి ఆయన చెప్పిందే జరగాలి తప్ప ఎట్టి పరిస్థితుల్లో స్థపతి తదితరుల నిర్ణయాలను పరిగణనలోకి తీసుకోవడం లేదంటున్నారు దేవాదాయ ఉద్యోగులు.
ఇదిలా ఉంటే కొమురవెల్లిలో రెండు బంగారు కిరీటాలకు సంబంధించి ఈయనగారికి అనుకూలమైన తమిళనాడుకు చెందిన ఓ కంపెనీకి మొదట్లో తయారీకి అవకాశమిచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారంటూ ‘నమస్తే తెలంగాణ’ తెరపైకి తేవడంతో నామినేషన్ రద్దు చేసి జనవరిలో ఈ- టెండర్లు పిలిచారు. ఇవి జరిగి మూడునెలలు కావస్తున్నా ఇప్పటివరకు టెండర్లు తెరువలేదు. మరోవైపు గోల్డ్ బాండ్స్ ఓపెన్ చేయాలంటూ ఈ కీలక వ్యక్తే దేవాలయ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారని తెలిసింది. గోల్డ్ పథకాలు ఎక్కడ జరిగినా వాటిని నడిపించడానికి, వాటిలో తన వంతు పాత్ర పోషించడంలో ఈ సలహాదారు ముందంజలో ఉంటారని ఆ శాఖలో చెవులు కొరుక్కుంటున్నారు.
దేవాదాయ శాఖ కమిషనర్, డైరెక్టర్ హనుమంతరావు ఇటీవల దేవాదాయ శాఖ బాధ్యతలతోపాటు రాబోయే సంవత్సరంలో జరుగనున్న గోదావరి పుష్కరాల ప్రత్యేక అధికారిగా నియమితులయ్యారు. అంతకుముందే మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో పలువురు మంత్రులతో పుష్కరాల నిర్వహణ ఇతర అంశాలపై క్యాబినెట్ సబ్‌కమిటీ ఏర్పాటైంది. ఇదిలా ఉంటే, కేసీఆర్ హయాంలో పదకొండు మందితో పుష్కరాల నిర్వహణపై ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేశారు. ఈసారి అలా కాకుండా మొత్తం దేవాదాయ ప్రత్యేక పదవిలో ఉన్న ఈ పెద్దమనిషే పుష్కరాలకు సంబంధించిన ఏర్పాట్లపై దిశానిర్దేశం చేస్తారని ఆ శాఖలో చెప్తున్నారు.
ఇందుకు సంబంధించి ఇప్పటికే రెండు దఫాలుగా కాళేశ్వరం వంటి చోట్లకు వెళ్లివచ్చిన ఈ సలహాదారు పుష్కరాలకు సంబంధంలేని కొన్ని కొత్త సంప్రదాయాలను ప్రవేశపెడుతున్నారని ధార్మికవేత్తలు ఆరోపిస్తున్నారు. పుష్కరాల్లో అవసరమైన వాటిపై దేవాదాయ శాఖ పక్షాన కొత్త కమిటీ రూపొందించాల్సి ఉండగా వేరేవారిని రానీయకుండా ఇప్పటికీ మొత్తం తానే అయి నడిపిస్తూ పుష్కరాలకు ప్రభుత్వం కేటాయించిన రూ.500 కోట్ల పనుల విషయంలోనూ తన పెత్తనాన్ని ప్రదర్శించబోతున్నారన్న చర్చ నడుస్తున్నది.
ఆయన గత చరిత్ర చాలా ఘనంగా చెప్పుకొంటారు. జోగుళాంబ దేవాలయంలో కొన్ని నిర్మాణ పనులు చేపట్టిన క్రమంలో ఆయనను కొంతకాలం సలహాదారుగా పెట్టుకున్నారు. ఆ సమయంలో ఆయన చేసిన కొన్ని అవకతవకలపై అప్పట్లో సంచలనం రేగింది. కంచిస్వామికి ఓ భక్తుడు మారేడుపల్లిలో ఓ ఇంటిని దానంగా ఇస్తానని చెప్పగా ఆ ఇంటిని తన పేరు మీద రాయించుకుని ఆ తర్వాత విషయం కాస్తా ముదరడంతో కంచి నుంచి బయటకు పంపారు. ఇక పుష్పగిరి పీఠానిది. చాలా పెద్ద తతంగం.
ఆ పీఠానికి సంబంధించిన ఆస్తుల వ్యవహారంలో తన కపట బుద్ధిని ప్రదర్శించడమే కాకుండా చివరకు అందుకు సంబంధించిన ఓ ఆస్తిని తాను అప్పనంగా కొట్టేశాడు. జూబ్లీహిల్స్ టీటీడీలోనూ ఈయనగారిది ఘనచరిత్రే. ఇక్కడ కూడా ఒక వివాదానికి కేరాఫ్‌గా ఉన్నట్టు ఆయనతో పనిచేసినవాళ్లు చెప్పుకొంటారు. యాదగిరిగుట్ట వేదపాఠశాల సలహాదారుగా ఉన్న ఈ కీలక వ్యక్తికి అసలు వేదమంటే తెలియదు. శాస్త్రం అంతకంటే తెలియదు. ఏమీ తెలియని వ్యక్తి మాటల గారడీకి గతంలో పీఠాలు, మఠాలు మోసపోయినట్టే, ఇప్పుడు తెలంగాణ ప్రజలు మోసపోతున్నారని ఈ ప్రాంత పండితులు, ధార్మికవేత్తలు చర్చించుకుంటున్నారు.
పండితులకు, ధార్మికవేత్తలకు పుట్టినిల్లయిన తెలంగాణలో ఈ ప్రాంతం వారిని కాదని ఏకంగా తమిళనాడుకు చెందిన ఓ వ్యక్తికి పెద్దపీట వేయడంపై దుమారం చెలరేగుతున్నది. తెలంగాణలో ఆగమ పండితులే లేరా? అసలు తెలంగాణలో ధార్మికపరులే కరువయ్యారా? అని ప్రశ్నిస్తున్న ధార్మికసంస్థలు, పండితులు గత రెండేండ్లుగా దేవాదాయ శాఖ పనితీరు పూర్తిగా కుంటుపడటానికి కారణం ఒక తమిళనాడుకు చెందిన వ్యక్తికి కీలక పదవి కట్టబెట్టడమేనంటూ ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తనకు ఢిల్లీలో ఓ కీలక వ్యక్తితో ఉన్న సంబంధాలతో రాష్ట్రంలో ఉన్న కొందరు ముఖ్య వ్యక్తులతో సన్నిహిత సంబంధాలు పెట్టుకుని వారికి తన గత చరిత్ర తెలియనీయకుండానే వారి సహకారంతో దేవాదాయ శాఖలోకి నెమ్మదిగా ప్రవేశించిన ఈ తమిళియన్ ఏకంగా తెలంగాణ దేవాదాయ శాఖలో అన్నీ తానే అయ్యాడంటూ ధార్మికవేత్తలు, పండితులు చెప్పుకొంటున్నారు.
అరవానికి చెందిన ఒక వ్యక్తి తన రాష్ట్రం వదిలేసి పక్క రాష్ర్టాల్లో పెద్ద ఎత్తున కుంభకోణాలకు పాల్పడి, తనను అక్కడి నుంచి బయటకు పంపిస్తే, తెలంగాణకు వచ్చి ఈ ప్రాంతంలో కీలకమైన దేవాదాయ శాఖ ముఖ్య పదవిలో కూర్చోవడాన్ని వారు తప్పుబడుతున్నారు. తద్వారా దేవాలయాల్లో ఆగమ సంప్రదాయాలన్నీ దెబ్బతినే అవకాశం ఉన్నదని, దేవాలయ వాస్తే తెలియని వ్యక్తి ఆలయ నిర్మాణాల్లో జోక్యం చేసుకోవడం, స్థపతి ఇతరుల సలహాలను తుంగలో తొక్కేయడంతో మొదటికే మోసం వస్తున్నదని వారు ఆరోపిస్తున్నారు. అసలు రాష్ట్రంలో ఈ పదవికి అర్హతలు ఉన్నవారెవరూ లేరా? ఆ పదవిలో కూర్చుండబెట్టడానికి ఆయనకున్న అర్హతలేమిటంటని ప్రశ్నిస్తున్నారు.
దేవాదాయ ఉద్యోగులకు సహజంగా కమిషనర్ బాస్ కాగా ఈయన గారే అన్ని వ్యవహారాల్లోనూ జోక్యం చేసుకుంటూ తన ఆజ్ఞ లేనిదే ఆ శాఖలో చీమైనా కుట్టకూడదంటూ ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతం దేవాదాయ శాఖలోనే చర్చనీయాంశమైంది. ఆ శాఖ నిర్వహించే ప్రతి ముఖ్య సమీక్ష సమావేశంలో ఆయనే కీలకంగా ఉంటుండగా దేవాదాయ శాఖకు సంబంధించిన ముఖ్య అధికారులెవరూ ఉండకపోవడం, ముందుగా ఉండి ఆ తర్వాత సమావేశాన్ని మొత్తం ఆయన చేతుల్లోనే పెట్టడంతో ప్రస్తుతం ఈవోలు సహా పలువురు దేవాదాయ అధికారులంతా ఈ పెద్దమనిషికి భయపడిపోవలసిన పరిస్థితి వచ్చింది.
ఈవోల బదిలీల విషయంలోనూ ఆయన చెప్పిన మాటకు ఎవరూ ఎదురు చెప్పకపోవడంతోపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ఆలయాల్లో ఆయన చెప్పిందే తుది నిర్ణయమంటూ కీలక అధికారుల నుంచి మౌఖిక ఆదేశాలుండటంతో మొత్తం దేవాదాయ శాఖలో సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. రాష్ట్రంలోని జాతరలు, దేవాలయాల్లో జరిగే వేడుకల్లో ప్రత్యేక ఆహ్వానితుడుగా అవకాశం కల్పించడంతో ఆయన ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సిబ్బందిపై తన ఆధిపత్యాన్ని చెలాయిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.