హైదరాబాద్, అక్టోబర్ 31 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై రగులుతున్న బాధిత ప్రజలు మునుగోడు ఉపఎన్నిక ఫలితం కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. నిత్యావసరా లు, వంటగ్యాస్, పెట్రో ధరల పెంపు, పన్నుల భారం, నిరుద్యోగం, విద్యుత్తు చట్టాలు, రైతు వ్యతిరేక విధానాలతో కేంద్రంపై గుర్రుగా ఉన్న ప్రజలు మునుగోడు ఓటర్లు ఇచ్చే తీర్పు కోసం ఎదురుచూస్తున్నారు. దేశంలోని దాదాపు ప్రతి వర్గం మోదీ సర్కార్ విధానాలతో సతమతమవుతుండగా.. మునుగోడు వాసులు కూడా తమ వంటి బాధితులేనని.. వారు బీజేపీకి గుణపాఠం నేర్పుతారంటున్నారు.
పన్నుల భారం మోయలేక
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత ఎనిమిదేండ్లలో ప్రతి వస్తువు ధర ఆకాశాన్ని తాకుతున్నది. పెట్రోల్, డీజిల్ ధర లు పట్టపగ్గాల్లేకుండా పెరిగిపోయాయి. 2014 లో రూ.400 ఉన్న గ్యాస్ ధర ప్రస్తుతం రూ.1200లకు పెరిగింది. పప్పులు, నూనెలు వంటి నిత్యావసర సరుకుల ధరలు అదుపులేకుండా పోయాయి. జీఎస్టీ మోతతో పసిపిల్లల పాల సీసా మొదలు వినిమయ వస్తువుల ధరలన్నీ మూడింతలు పెరిగిపోయాయి. నిరుద్యోగం పెరిగిపోగా.. ఆదాయాలు దిగజారిపోయాయి. దీంతో పేద, మధ్య తరగతి వర్గాలు కేంద్రంపై తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తంచేస్తున్నా యి. స్టీల్, సిమెంట్ ధరల పెంపుతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు, సొంతిల్లు కట్టుకొందామనుకున్న మధ్య తరగతి వర్గాలు తీవ్ర అసంతృప్తిని వెళ్లగక్కుతున్నాయి. మోదీ సర్కార్ చేనేతపై జీఎస్టీ విధించింది. దీంతో దేశవ్యాప్తంగా నేతన్నలు పోరుకు సిద్ధమవుతున్నారు.
అసంతప్తిలో సబ్బండవర్ణాలు
కేంద్రంపై సబ్బండవర్ణాలు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నాయి. దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరించడంలో కేంద్రం చేస్తున్న తాత్సారాన్ని, నిర్లక్ష్యాన్ని ప్రశ్నిస్తూ ఒక్కో వర్గం రోడ్డుకెక్కుతున్నది. జాతీయస్థాయిలో రాజ్యాంగబద్ధమైన కమిషన్‌ను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌తో దివ్యాంగులు గత మార్చిలో చలో ఢిల్లీ నిర్వహించారు. బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు కల్పించాలని, ఓబీసీ గణన చేపట్టాలని డిమాండ్చేస్తున్నారు. బీజేపీ పాలనలో అత్యధికంగా పీడనకు గురవుతున్నది తామేనని దళితులు భావిస్తున్నారు. ఎస్సీ వర్గీకరణ కోసం ఎనిమిదేండ్లుగా తీవ్రం గా పోరాటం చేస్తున్నారు. తెలంగాణ సర్కారు సైతం ఈ మేరకు అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపింది. ఇప్పటివరకు మోదీ సర్కారు దీనిపై నిర్ణయం తీసుకోకపోవడంతో దళితుల్లో తీవ్ర వ్యతిరేకత వెల్లడవుతున్నది.
మరోపోరాటానికి రైతాంగం..
కేంద్రం తెచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఏడాదిపాటు పోరాడిన రైతులు వాటి ని ప్రభుత్వం ఉపసంహరించుకొనేంత వరకు విశ్రమించలేదు. గిట్టుబాటు ధరలపై చట్టం చేయాలని, స్వామినాథన్ సిఫారసులను అమలు చేయాలని ఇప్పటికే పలు రాష్ర్టాల్లో రైతులు వివిధ రూపాల్లో ఆందోళన చేశారు. కానీ కేంద్ర సర్కారు ఇప్పటికీ ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. దీంతో రైతాంగం మరోమారు పోరుబాట పట్టేందుకు సిద్ధమవుతున్నది.
ఏకతాటిపైకి 25 విద్యుత్తు సంఘాలు
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ చట్టంపై దేశవ్యాప్తంగా విద్యుత్తు సంఘాలు భగ్గుమంటున్నాయి. ఆ చట్టంతో విద్యుత్తు వ్యవస్థ కార్పొరేట్ల చేతుల్లో వెళ్తుందని కార్మిక వర్గాలు ఆందోళన చెందుతున్నాయి. దీనిపై పోరాడేందుకు రాష్ట్రంలోని అన్ని సంఘాలు జేఏసీగా ఏర్పడ్డాయి. ఆ చట్టం అమలులోకి వస్తే మోటర్లకు మీటర్లు పెట్టుడు ఖాయమవడంతో రైతులు కూడా ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తున్నారు. కార్మిక చట్టాల సరళీకృతం పేరిట కేంద్ర ప్రభుత్వం నూతన లేబర్ కోడ్లను తీసుకొచ్చింది. 44 కార్మికుల చట్టాలను కుదించింది. పాతకార్మిక చట్టాల్లోని కార్మికుల హక్కులను కాలరాయడంతోపాటు పనిగంటలను 8 నుం చి 12 గంటలకు పెంచుతూ సవరణలు చేసిం ది. ఎల్ఐసీతో సహా మహా, మినీ రత్న కంపెనీలను సైతం అమ్మేందుకు పూనుకొన్నది. ఈ విధానాలపై కార్మికలోకం నిప్పులు చెరుగుతున్నది. ఇప్పటికే రెండుసార్లు దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెకు దిగారు. అయినా కేంద్రం నుంచి ఇప్పటివరకు ఉలుకూ పలుకు లేకపోవడంతో ఈ సారి ఏకంగా కుటుంబాలతో సహా ధర్నాకు దిగాలని ట్రేడ్ యూనియన్లు ముమ్మర కసరత్తును చేపట్టాయి. ఈ పరిణామాల నేపథ్యంలో మునుగోడులోని సబ్బండవర్ణాలు బీజేపీ అభ్యర్థిని ఓడించడం ద్వారా కేంద్ర ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పాలని భావిస్తున్నాయి. ఇలా ప్రతి వర్గమూ అశాంతితో రగిలిపోతూ కాషాయ పార్టీపై, మోదీ విధానాలపై ప్రతీకారం తీర్చుకొనేందుకు వేచి చూస్తున్నాయి.
టీఆర్ఎస్లో చేరిన హైర్ బస్ అసోసియేషన్ సభ్యులు
యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలంలో ఉన్న హైర్ బస్ ఓనర్స్ అసోసియన్ సభ్యులు సోమవారం హైదరాబాద్‌లో ఐటీ మంత్రి కేటీఆర్ సమక్షంలో టీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. మునుగోడు ఉప ఎన్నికలో కారు గుర్తుకు ఓటేసి టీఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని సభ్యులు చెప్పారు. కార్యక్రమంలో హైర్ బస్ ఓనర్స్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ వరకం మైపాల్‌రెడ్డి, నాయకులు మధుకర్‌రెడ్డి, ప్రదీప్‌రెడ్డి, మల్లారెడ్డి, శివకుమార్, మాధవరెడ్డి, లింగారెడ్డి తదితరులు పాల్గొన్నారు.