రాజన్న సిరిసిల్ల, మే 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మనవడు, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తనయుడు కల్వకుంట్ల హిమాన్షురావు సోమవారం రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటించారు. మొదట వేములవాడలోని రాజరాజేశ్వరస్వామి అనుబంధ ఆలయమైన భీమేశ్వరస్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయగా, ఈవో రమాదేవి స్వామివారి ప్రసాదాన్ని అందజేశారు. అనంతరం సిరిసిల్లలోని తెలంగాణ భవన్‌కు వచ్చిన హిమాన్షును బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య, స్థానిక నేతలను పరిచయం చేశారు. ఆ తర్వాత సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని చంద్రంపేటలో చేనేత కళాకారుడు వెల్ది హరిప్రసాద్ నివాసానికి వెళ్లి, ఆయన కార్ఖానాలో చేనేత మగ్గంపై నేస్తున్న చీరలు, వస్ర్తాలను స్వయంగా పరిశీలించారు.
ఈ సందర్భంగా పవర్లూమ్ మగ్గంపై నేస్తున్న వస్ర్తాలను తన స్నేహితులకు వివరించి మూడు చీరలను కొనుగోలు చేశారు. అనంతరం సిరిసిల్ల గాంధీ చౌరస్తాలోని కేటీఆర్ టీస్టాల్‌ను సందర్శించి, అక్కడ టీ తాగిన హిమాన్షు.. హోటల్ బాగా నడుస్తుందా? అని నిర్వాహకుడు శ్రీనివాస్‌ను అడిగి తెలుసుకున్నారు. తరువాత గంభీరావుపేటకు వెళ్లి కేజీ టు పీజీ క్యాంపస్‌ను సందర్శించగా, హిమాన్షుతో సెల్ఫీ దిగడానికి అక్కడి వారు పోటీపడ్డారు. అనంతరం తిరిగి హైదరాబాద్‌కు పయనమయ్యారు. ఆయనవెంట తోట ఆగయ్యతోపాటు బీఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి గూడూరి ప్రవీణ్, ఏనుగు మనోహర్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు జిందం చక్రపాణి, బొల్లి రామ్మోహన్, తదితరులు ఉన్నారు.