హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): ప్రాథమిక అధ్యయనం చేయకుండా.. ఫీజిబిలిటీ రిపోర్ట్ లేకుండా.. డీపీఆర్ రూపొందించకుండా.. కనీసం బోర్డు ఆమోదం తీసుకోకుండా తెలంగాణ జెన్కో హిమాచల్ ప్రదేశ్‌లో జల విద్యుత్తు ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు పరుగులు పెట్టింది. 520 మెగావాట్ల జల విద్యుత్తు ప్లాంట్లను హిమాచల్ ప్రదేశ్‌లో నెలకొల్పేందుకు శనివారం ఒప్పందం కుదుర్చుకున్నది. ఆ రాష్ట్రంలోని సెలిలో 400 మెగావాట్లు, మియార్‌లో 120 మెగావాట్ల జలవిద్యుత్తు ప్లాంట్లను నెలకొల్పేందుకు హిమాచల్‌ప్రదేశ్ సీఎం సుఖ్వీందర్ సింగ్ సుఖు, రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సమక్షంలో శనివారం ఎంవోయూ జరిగింది. అయితే ఈ ఒప్పందంపై విద్యుత్తు రంగ నిపుణులు పెదవి విరుస్తున్నారు. ఈ ప్రాజెక్టు అంత అనుకూలం కాదని, ఫలితంగా జెన్కో నష్టపోయే ప్రమాదముందని, దీని భారం అంతిమంగా రాష్ట్ర ప్రజలపై పడుతుందని హెచ్చరిస్తున్నారు. అత్యంత గోప్యంగా, హడావుడిగా ఎంవోయూ కుదర్చుకోవడం ఎందుకనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ కాదని అక్కడెందుకని పేర్కొంటున్నారు.
మన రాష్ట్రంలోని దుమ్ముగూడెంలో జల విద్యుత్తు ప్లాంట్ నిర్మాణానికి అన్ని రకాల అవకాశాలున్నాయి. దీంతో ఇక్కడి ప్రాజెక్టును వదిలిపెట్టి, హిమాచల్‌ప్రదేశ్‌కు పరుగులు పెట్టడంపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలో 6,485.26 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాలను జెన్‌కోయే నిర్మించింది. రాష్ట్రం బయట ప్లాంట్‌ను నిర్మించడం ఇదే తొలిసారి. ఏదైనా ప్లాంట్‌ను నిర్మించే ముందు ఓ ఏజెన్సీ ద్వారా ఫీజిబిలిటీ రిపోర్ట్‌ను తయారు చేస్తారు. ఆ తర్వాత డీపీఆర్‌ను రూపొందిస్తారు. కానీ, హిమాచల్ ప్లాంట్ల విషయంలో ఇవేవి జరగలేదు.