హైదరాబాద్ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, డిసెంబర్ 1 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్ మహా నగర పరిధిలోని 22 పారిశ్రామికవాడల్లో ఉన్న వేలాది పరిశ్రమలు ఒక్క రాత్రిలో ఏర్పాటు కాలేదు. ఏ ఒక్క ప్రభుత్వమో ఈ స్థాయి పారిశ్రామికాభివృద్ధిని సాధించలేదు. దాదాపు ఆరేడు దశాబ్దాలుగా అనేక ప్రభుత్వాలు సర్కారు భూములతో పాటు రైతుల నుంచి భూములను సేకరించి పరిశ్రమల ఏర్పాటుకు కేటాయించాయి. పారిశ్రామికవేత్తల్ని ప్రోత్సహించడంతోపాటు బ్యాంకు రుణాలు, ఇతరత్రా ఆర్థికపరమైన అంశాల్లో వాళ్లకు ఇబ్బందులు రాకుండా ఉండేందుకు రాయితీలపై భూముల్ని ఇచ్చి వారి పేరిట రిజిస్ట్రేషన్లు చేశాయి. భూములను రియల్ రంగం వైపు మళ్లించకుండా ఉండేందుకు భూ వినియోగాన్ని కేవలం పారిశ్రామిక అవసరాలకే పరిమితం చేశాయి. కాలానుగుణంగా నగరం విస్తరించడంతో ఈ పారిశ్రామికవాడల చుట్టూ నివాస ప్రాంతాలు వచ్చాయి. దీంతో కాలుష్యం నుంచి ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు పరిశ్రమలను అవుటర్ రింగు రోడ్డు అవతలికి తరలించాలని 2013లోనే ఉమ్మడి రాష్ట్రంలో ప్రయత్నాలు మొదలయ్యాయి. కానీ పూర్తిస్థాయిలో ఆ ప్రక్రియ పట్టాలెక్కలేదు.
ముఖ్యంగా రాష్ట్ర ఆర్థికాభివృద్ధిలో పారిశ్రామిక రంగం నుంచి దాదాపు 19 శాతానికి పైగా ఆదాయం వస్తున్నది. ఇంత కీలకమైన రంగం చెదిరిపోకుండా… కాలుష్యాన్ని అవుటర్ బయటకు తరలించే ప్రక్రియ పూర్తి అనేది ఒక్కరోజుతో అయ్యే పని కాదు. అందుకే గతంలోని ప్రభుత్వాలు ఆచితూచి వ్యవహరించడంతోపాటు ఉన్న పరిశ్రమల నుంచి కాలుష్యం బయటికి రాకుండా ఉండేందుకు చర్యలు తీసుకున్నాయి. కానీ రేవంత్‌రెడ్డి ప్రభుత్వం రాత్రికి రాత్రి పరిశ్రమల్ని తరలిస్తామంటూ హిల్ట్ పాలసీని తెరపైకి తెచ్చింది. భారీ రియల్ ఎస్టేట్ దందాకు శ్రీకారం చుట్టింది. ఏ రాష్ట్రంలోనైనా పరిశ్రమల ఏర్పాటు కోసం పారిశ్రామికవేత్తలకు రాయితీలతో ప్రోత్సాహకాలు ఇవ్వడం సాధారణం. కానీ చరిత్రలోనే తొలిసారిగా కాంగ్రెస్ ప్రభుత్వం పరిశ్రమల మూసివేతకు రాయితీలు ఇవ్వడం, అందునా పారిశ్రామికవేత్తలను రియల్టర్లుగా మార్చేలా పాలసీని తీసుకురావడం విడ్డూరంగా ఉందని పలువురు మండిపడుతున్నారు.
రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి వెన్నుముకలాంటి పారిశ్రామిక రంగాన్ని కుదిపేసే హిల్ట్ పాలసీని ఎలాంటి అధ్యయనం లేకుండానే కాంగ్రెస్ ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. కనీసం క్షేత్రస్థాయిలో ఎన్ని పరిశ్రమలు నడుస్తున్నాయి? ఖాయిలాపడినవి ఎన్ని? అసలు కాలుష్యకారక, కాలుష్యరహిత పరిశ్రమలేవి? ఆయా భూముల్ని క్రమబద్ధీకరించి నివాస, వాణిజ్య వినియోగాలకు అనుమతులు ఇవ్వొచ్చా? ఇస్తే కలిగే దుష్పరిణామాలు ఏవి? ఇలా కించిత్తు అధ్యయనంగానీ సర్వేగానీ ప్రభుత్వం నిర్వహించలేదంటే అవుటర్ అవతలకు కాలుష్యాన్ని తరలించాలనేది ప్రధాన ఉద్దేశం కాదని అర్థమవుతున్నది.
ప్రస్తుతం ఉత్పత్తిని కొనసాగిస్తున్న కాలుష్య కారక పరిశ్రమలనే కాకుండా ఖాయిలాపడిన, కాలుష్యరహిత గ్రీన్ జోన్లో ఉన్న పరిశ్రమల భూములను కూడా ఈ పాలసీ కింద క్రమబద్ధీకరిస్తుండటం భూ కుంభకోణానికి బలాన్ని చేకూరుస్తున్నది. హిల్ట్ పాలసీలో కేవలం పరిశ్రమల భూముల్ని క్రమబద్ధీకరించే అంశమే ఉందిగానీ ఎక్కడా మూసివేసిన పరిశ్రమల పునరుద్ధరణకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కనీసం ప్రభుత్వం నుంచి ప్రయోజనం పొందుతున్న పారిశ్రామికవేత్తలు కచ్చితంగా తిరిగి పరిశ్రమలను ఏర్పాటు చేయాలనే నిబంధన ఉంచకపోవడంతో పారిశ్రామికరంగం కకావికలం కానుందని తెలంగాణ పారిశ్రామికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. పైగా అవుటర్ అవతల పరిశ్రమల పునరుద్ధరణకు ప్రభుత్వం ప్రత్యేకంగా క్లస్టర్లను ఏర్పాటు చేయలేదు.
ఇష్టముంటే గతంలో ఏర్పాటుచేసిన సెజ్‌ల్లో భూములు కొనుగోలు చేసి పరిశ్రమలను ఏర్పాటు చేయాలని సూచిస్తున్నది. అంటే అగ్గువకు భూముల్ని క్రమబద్ధీకరించుకొని కోట్లు దండుకున్న వాళ్లు ఇష్టముంటేనే పరిశ్రమలు ఏర్పాటు చేయొచ్చనే వెసులుబాటును ప్రభుత్వమే కల్పిస్తున్నది.
నగరంలోని పరిశ్రమలు దాదాపు 60 శాతానికిపైగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారి చేతిలోనే ఉన్నాయని ఓ తెలంగాణ పారిశ్రామికవేత్త తెలిపారు. ఇందులో చాలా వరకు ఖాయిలా పడినట్టుగా చెప్పారు. పటాన్చెరు వంటి ప్రాంతంలో ఒక్కో కంపెనీ 20-50 ఎకరాల విస్తీర్ణంలో కూడా ఉన్నాయి. కాగా ఏపీ ప్రభుత్వం కొంతకాలంగా పారిశ్రామికాభివృద్ధి కోసం నామమాత్రపు రేటుతో పరిశ్రమలకు భూములను కేటాయిస్తున్నది. ఈ మేరకు 22 పారిశ్రామికవాడల్లో ఖాయిలా పరిశ్రమల యజమానులు ఒక బృందంగా ఏర్పడి ఏపీ ప్రభుత్వంలోని ఒక కీలక నేతను కలిసినట్టు తెలిసింది. తాము ఏపీలో పరిశ్రమలు పెట్టాలంటే హైదరాబాద్ పరిధిలో నిరుపయోగంగా ఉన్న తమ పరిశ్రమల భూములను రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకునేలా వెసులుబాటు కల్పించాలని, తద్వారా వచ్చే లాభాలతో ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు అవకాశం ఉంటుందని వివరించినట్టు విశ్వసనీయంగా తెలిసింది.
ఆ తర్వాతనే సదరు కీలకనేత లాబీయింగ్ చేసి హిల్ట్ పాలసీకి బీజం వేసినట్టు సమాచారం. అందుకే మంత్రివర్గ సమావేశంలో నేరుగా హిల్ట్ పాలసీ పెట్టే వరకు సంబంధిత మంత్రితో పాటు ఇతర మంత్రివర్గానికీ దీనిపై పెద్దగా అవగాహన లేనట్టు ఇప్పటికే బయటికొచ్చింది. రాష్ట్రంలో మరీ ముఖ్యంగా హైదరాబాద్ పరిధిలో భూములకు సంబంధించిన పనులు కొందరు మంత్రులు చెప్పినా కావడంలేదని, కానీ ఏపీలోని సదరు కీలక నేత మాత్రం ఒక ఫోన్‌కాల్‌తోనే లావాదేవీలు జరిగిపోతున్నాయని జరుగుతున్న ప్రచారానికి హిల్ట్ పాలసీ మరింత ఆజ్యం పోసినట్టయ్యింది.
22 పారిశ్రామికవాడల్లో దాదాపు 5వేలకుపైగా పరిశ్రమలను మూసివేయడం వల్ల దాదాపు 50,000 మందికి పైగా ఉద్యోగులు ఉపాధి కోల్పోనున్నారు. ఒక్కో యూనిట్లో ఇద్దరు-ముగ్గురు ఉద్యోగుల నుంచి 50 మంది వరకూ పనిచేస్తున్నారని, పరిశ్రమలను మూసివేస్తే వారంతా నిరుద్యోగులుగా మారిపోతారని వారు పేర్కొంటున్నారు.
ఏపీలో నామమాత్రపు రేటుతో భూములు వస్తున్నందున ఇక్కడ రియల్ వ్యాపారంలో వచ్చిన లాభాలతో అక్కడ పరిశ్రమను ఏర్పాటు చేసేందుకు యోచిస్తున్నట్టు తెలిసింది. ఇప్పటికే ఖాయిలా పడిన పరిశ్రమల యజమానులు ఇందులో ముందు వరుసలో ఉండగా.. పరిశ్రమలు నడుపుతున్న వాళ్లు కూడా ఎలాగూ ఇక్కడ పరిశ్రమల్ని అవుటర్ అవతలికి తరలించాల్సి ఉన్నందున ఏర్పాటు చేసే పరిశ్రమేదో ఏపీలో పెడితే సరిపోతుందనే భావన కూడా వ్యక్తం చేస్తున్నట్టు పారిశ్రామికవేత్త ఒకరు చెప్పారు. ఇందుకు అనేక కారణాలు కూడా చెప్తున్నారు. అవుటర్ అవతల పరిశ్రమ ఏర్పాటు చేయాలంటే ముందు భూములు కొనుగోలు చేయాలి.
హైదరాబాద్ చుట్టూ అవుటర్ అవతల కూడా భూముల రేట్లు ఎకరా కోట్లల్లో ఉన్నాయి. జాతీయ, రాష్ట్ర రహదారుల నుంచి లోపలికి 10-20 కిలోమీటర్లు వెళ్లినా ఎకరా కనీసంగా రూ.50 లక్షల నుంచి కోటి రూపాయల వరకు ఉంది. టీజీఐఐసీకి చెందిన సెజ్‌ల్లో ఏర్పాటు చేయాలన్నా అక్కడా రేట్లు భారీగానే ఉన్నాయి. దీంతో భూములకు కోట్లు పెట్టి… కొత్తగా పరిశ్రమ ఏర్పాటుకు మరిన్ని కోట్లు పెట్టడం అనేక వ్యయ ప్రయాసలతో కూడుకున్నదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది.
వాస్తవానికి ప్రభుత్వం హిల్ట్ పాలసీని రూపొందించే సమయంలోనే ఇలాంటి పరిణామాలన్నింటినీ పరిగణలోనికి తీసుకొని పరిశ్రమలు తరలిపోకుండా చర్యలు చేపట్టాల్సి ఉంటుంది. కానీ ఏడాదిన్నర మథనం చేశామని చెబుతున్న ప్రభుత్వ పెద్దలకు హిల్ట్ పాలసీతో చోటుచేసుకునే పరిణామాలు తెలియనివి కావు. అయినప్పటికీ తెలంగాణ పారిశ్రామిక రంగాన్ని కాపాడేందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదంటే ఏపీకి పరిశ్రమల తరలింపు కుట్ర కాకపోతే ఇంకేం అవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.