Heatwave Alert | హైదరాబాద్, మే 24 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో భానుడు భగభగమంటున్నాడు. ఎండ.. ప్రచండాన్ని తలపిస్తున్నది. పగటి ఉష్ణోగ్రతలు అసాధారణంగా పెరుగుతుండటంతో వారం రోజులుగా పలు జిల్లాల్లో ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి చేరాయి. ఆదివారం 21 జిల్లాల్లో 45 డిగ్రీలకు పైగా గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఆయా జిల్లాలకు వాతావరణశాఖ రెడ్ అలర్ట్ ప్రకటించింది.
అత్యధికంగా కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లాలో 46.5 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. రికార్డు ఉష్ణోగ్రతలతో ప్రజలు విలవిల్లాడుతున్నారు. భానుడు నిప్పులకుంపటిని తలపిస్తుండటంతో జనం ఇండ్ల నుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. తీవ్ర ఎండల కారణంగా వడదెబ్బతో కొందరు అస్వస్థతకు గురికావడం, మరికొందరు ప్రాణాలు కోల్పోతుండటం తీవ్ర భయాందోళనకు గురిచేస్తున్నది.
ఎండ తీవ్రతకు శనివారం ఒక్కరోజే రాష్ట్రంలో 51 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉమ్మడి వరంగల్ జిల్లాలో 23మంది, ఉమ్మడి కరీంనగర్లో 11మంది, ఖమ్మంలో ఏడుగురు, ఆదిలాబాద్‌లో ఐదుగురు, నల్లగొండలో ఐదుగురు చొప్పున ప్రాణాలు విడిచారు. రాష్ట్రంలో గత మూడు రోజుల్లోనే 107 మంది చనిపోవడం గమనార్హం.
రాష్ట్రంలో మరో మూడు రోజులు వడగాడ్పుల తీవ్రత ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రస్తుతం రాష్ట్రంలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతుండగా, దీనికితోడు వడగాడ్పులతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ నెల 27 వరకు కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ములుగు, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో తీవ్ర వడగాడ్పుల ప్రభావం ఉండనున్నట్టు వాతావరణశాఖ తెలిపింది.
ఒకవైపు ఎల్‌నినో భయాలు, మరోవైపు దంచికొడుతున్న ఎండల నడుమ భారత వాతావరణశాఖ చల్లని కబురు అందించింది. నైరుతి రుతుపవనాలు వేగం పుంజుకుని ముందుకు సాగుతున్నాయని తెలిపింది. రెండ్రోజుల్లో రుతుపవనాలు ఆగ్నేయ అరేబియా సముద్రంలోని అన్ని ప్రాంతాలు, కొమరిన్ ప్రాంతం, నైరుతి , ఆగ్నేయ బంగాళాఖాతం, అండమాన్ సముద్రంలోని మిగిలిన భాగాలు, తూర్పు-మధ్య బంగాళాఖాతంలోని మరిన్ని ప్రాంతాలకు విస్తరించనున్నాయి. ఈ నెల 26న కేరళలోకి ప్రవేశించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నట్టు వాతావరణశాఖ తెలిపింది. తెలంగాణ, జమ్ముకశ్మీర్, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, హర్యానా, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మహారాష్ట్ర, గుజరాత్, రాజస్థాన్, బీహార్, జార్ఖండ్, పశ్చిమబెంగాల్, ఒడిశా, కర్ణాటక, కేరళ, గోవా రాష్ర్టాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని అధికారులు తెలిపారు. మే 26 నుంచి 29 మధ్య రాష్ట్రంలోని పలు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు వెల్లడించారు.
గడిచిన 24 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. నారాయణపేట జిల్లా కృష్ణలో అత్యధికంగా 5.45 సెం.మీ వర్షపాతం నమోదైంది. జోగుళాంబ గద్వాలలో 3.72 సెం.మీ, ఐజాలో 2.81 సెం.మీ, అలంపూర్‌లో 2.68 సెం.మీ, వనపర్తి జిల్లా చిన్నంబావిలో 3.50సెం.మీ, ఆత్మకూరులో 3.32 సెం.మీ, వనపర్తిలో 3.17 సెం.మీ, మద్నూర్‌లో 2.68 సెం.మీ, పెద్దమామిడిలో 2.64 సెం.మీ, అమరచింతలో 2.36 సెం.మీ చొప్పున వర్షపాతం నమోదైనట్టు అధికారులు వెల్లడించారు.