హైదరాబాద్/ నాంపల్లి క్రిమినల్ కోర్టులు, మే 30 (నమస్తే తెలంగాణ) : ప్రశ్నించే గొం తుకపై మరోసారి నియంతృత్వ కాంగ్రెస్ సర్కార్ ఉక్కుపాదం మోపింది. సింగరేణిలో అక్రమాలపై నిలదీసిన మాజీ ఎంపీ, చెన్నూర్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్‌పై కక్ష సాధింపునకు దిగి అక్రమ కేసులు బనాయించింది. ఈ క్రమంలో శనివారం బీఆర్ఎస్ కేంద్ర కార్యాలయం తెలంగాణ భవన్ వద్ద బలవంతంగా పోలీసులు బాల్క 3వ పేజీ సుమన్‌ను అదుపులోకి తీసుకొని నాంపల్లి పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసేందుకు శనివారం మధ్యాహ్నం టాస్క్‌ఫోర్స్ పోలీసులు పెద్దసంఖ్యలో తెలంగాణ భవన్‌కు చేరుకొని మోహరించారు. సమాచారం తెలిసి బీఆర్ఎస్ శ్రేణులు పెద్దసంఖ్యలో తరలివచ్చారు. పోలీసులు బలవంతంగా భవన్ గేటును తోసుకుంటూ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించారు. వారిని బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు నిలువరించారు. నాలుగురోజులుగా మిన్నకుండి కోర్టుకు సెలవు రోజుల్లో ఎందుకు అరెస్ట్ చేస్తున్నారని ప్రశ్నించారు. ప్రజాపాలన అంటే అక్రమంగా నిర్బంధించడమేనా? అంటూ నిలదీశారు. ‘ఇందిరమ్మ రాజ్యం..ఇదేమీ దౌర్జన్యం.. పోలీసు జులుం నశించాలి.. రేవంత్‌రెడ్డి డౌన్ డౌన్..’అంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ క్రమంలో పోలీసులు కార్యకర్తలతో దురుసుగా ప్రవర్తించారు. వారు పోలీసులతో వాగ్వాదానికి దిగడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొన్నది. బీఆర్ఎస్ లీగల్ సెల్ ప్రతినిధులు, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్‌కుమార్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్, పార్టీ నేతలు కిశోర్‌గౌడ్, కురువ విజయ్‌కుమార్, తుంగ బాలు, మన్నె గోవర్ధన్‌తో కలిసి బాల్క సుమన్ గేటు బయటకు రావడంతో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
సింగరేణి విషయంలో రెచ్చగొట్టే వాఖ్యలు చేశారన్న ఫిర్యాదుతో బాల్క సుమన్‌ను అరెస్ట్ చేసిన పోలీసులు నాంపల్లి ఠాణాకు తరలించి సుమారు 3 గంటలపాటు విచారణ చేపట్టారు. ఈ నెల 26న సింగరేణి సంస్థ ఇన్స్పెక్టర్ ఆనంద్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్లో ఇన్స్పెక్టర్ వాంగ్మూలాన్ని సైతం రికార్డు చేశారు. మిలిటెంట్‌గా వ్యవహరించాలని వ్యాఖ్యలు చేయడం చట్ట వ్యతిరేకమని ఫిర్యాదులో తెలిపారు. సెక్షన్లు 326 (జీ),351 (3), 1,బీ, రెడ్‌విత్ 55, రెడ్‌విత్ 61(2)(ఏ) బీఎన్ఎస్, 4 పీడీపీపీఏ కింద కేసు నమోదు చేశారు. ప్రభుత్వ దవాఖానలో వైద్య పరీక్షలు నిర్వహించి సుమన్‌ను నారాయణగూడలో మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరుచగా 14 రోజులు జ్యుడీషియల్ రిమాండ్‌కు విధించారు. డీసీపీ శిల్పవల్లి సమక్షంలో పోలీసు అధికారులు బాల్క సుమన్‌ను విచారించారు.
తనపై అక్రమ కేసులు పెట్టడంపై ఉన్న శ్రద్ధ సింగరేణి కార్మికుల సంక్షేమంపై పెట్టాలని సర్కార్‌కు బాల్క సుమన్ హితవుపలికారు. చిత్తశుద్ధి ఉంటే వాసరత్వ ఉద్యోగాలు ఇవ్వాలని, కార్మికులకు ఇండ్ల పట్టాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సింగరేణిలో సోలార్ప్లాం ట్లు, నైని బొగ్గుబ్లాకుల వేలంలో కాంగ్రెస్ పెద్దలు కుంభకోణాలకు తెరలేపారని విమర్శించారు. కేసీఆర్ పాలనలో వెలుగులు విరజిమ్మి న సింగరేణి కాంగ్రెస్ హయాంలో బొందలగడ్డగా మారిందని ఆవేదన వ్యక్తంచేశారు. కార్మికుల కష్టాల గురించి మాట్లాడితే ఓర్వలేక కేసు లు పెట్టి జైలుకు పంపే కుట్రలు చేస్తున్నద ని విమర్శించారు. చట్టాన్ని గౌరవించే, రాజ్యాంగాన్ని అనుసరించే వ్యక్తిగా పోలీసులకు సహకరిస్తానని స్పష్టంచేశారు. అంతిమంగా న్యా యం, ధర్మానిదే విజయమని తేల్చిచెప్పారు.
కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు, 420 హామీల అమలు, సింగరేణిలో జరుగుతున్న అక్రమాలపై ప్రశ్నించినందుకే తనపై రేవంత్‌రెడ్డి సర్కార్ కక్ష సాధిస్తున్నదని బాల్క సుమన్ ఆగ్రహం వ్యక్తంచేశారు. అరెస్ట్‌కు ముందు తెలంగాణ భవన్ వద్ద మీడియాతో మాట్లాడారు. కేసులు తనకు కొత్తకాదని, తెలంగాణ ఉద్యమంలో అప్పటి కాంగ్రెస్ పాలకులు 226 అక్రమ కేసులు పెట్టారని గుర్తుచేశారు. మొన్న క్యాతనపల్లి మున్సిపాలిటీని దొడ్డిదారిన దక్కించుకొనేందుకు యత్నించిన కాంగ్రెస్‌ను అడ్డుకున్న తనతో పాటు పార్టీ నేతలు 25 మందిపై అక్రమ కేసులు బనాయించి 16 రోజులు ఆదిలాబాద్ జైలులో నిర్బంధించి తీవ్ర ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. అయినా సీఎం రేవంత్, మంత్రి వివేక్ కడుపుమంట చల్లారలేదని, అందుకే మళ్లీ కేసులు పెట్టారని దుయ్యబట్టారు. ‘నేను 2014లో ఎంపీగా, 2018లో ఎమ్మెల్యేగా సింగరేణి కార్మికుల ఓట్లతోనే గెలిచాను. ఈ క్రమంలో కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ చేస్తున్న అన్యాయాన్ని ప్రశ్నించాను. కానీ ప్రభుత్వ పెద్దలు సహనం కోల్పోయి ప్రశ్నించినందుకు నా గొంతునొక్కే ప్రయత్నం చేస్తున్నారు. నన్ను అరెస్ట్ చేసి పైశాచికానందం పొందుతున్నారు’ అని ధ్వజమెత్తారు.