బంజారాహిల్స్, జూలై 29 : హైదరాబాద్‌లోని తెలుగు ఫిలిం చాంబర్లో తెలంగాణ సెగ రాజుకున్నది. చాంబర్లో తెలంగాణకు చెందిన సీని కళాకారులకు ప్రాధాన్యత లేదంటూ సీనియర్ జర్నలిస్టు పాశం యాదగిరి నేతృత్వంలో పలువురు నిరసనకు దిగారు. ఆంధ్రా గోబ్యాక్…. జై తెలంగాణ అంటూ నినాదాలు చేశారు. చాంబర్ ఆఫీస్‌లోకి చొచ్చుకొని వెళ్లేందుకు ప్రయత్నించారు. నిర్మాతల మండలి కార్యదర్శి ప్రసన్నకుమార్ అడ్డుకుని బయటకు నెట్టివేయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం, తోపులాట జరిగింది. చాంబర్ గోడలపై ఉన్న ఫొటోల విషయంలో స్పష్టత ఇవ్వాలని, తెలంగాణకు చెందిన సినీ దిగ్గజం పైడి జయరాజ్ ఫొటోకు తగిన ప్రాధాన్యత ఇవ్వలేదని ఆగ్రహించారు. ప్రముఖ సినీ గేయ రచయిత సింగిరెడ్డి నారాయణరెడ్డి ఫొటో లేకపోవడం దారుణమని ఆగ్రహం వ్యక్తంచేశారు. పోలీసులు వచ్చి, పరిస్థితిని చక్కదిద్దారు. ఫిలించాంబర్ తప్పును సరిదిద్దుకోకుంటే ఆందోళన తీవ్రం చేస్తామని పాశం యాదగిరి మండిపడ్డారు.
సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో సినీపరిశ్రమలో తెలంగాణ కళాకారులు వివక్షను ఎదుర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత పదేండ్ల కేసీఆర్ పరిపాలనలో తెలంగాణ సినిమా అభివృద్ధి దిశగా సాగింది. తెలంగాణ ఇతివృత్తాలతో విరివిగా సినిమాలు నిర్మించారు. హైదరాబాద్‌లో సినీపరిశ్రమ అభివృద్ధికి కేసీఆర్ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు సత్ఫలితాలు ఇచ్చాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితి మొదటికొచ్చిందని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. టాలీవుడ్లో సమైక్యరాష్ట్రం నాటి పరిస్థితులు కనిపిస్తున్నాయని తెలంగాణవాదులు అంటున్నారు. ఏపీలోని ఓ పార్టీకి అనుకూల వ్యక్తులుగా పేరున్న సినిమా పెద్దలు.. రేవంత్ సర్కార్ అండదండలతో తెలంగాణ కళాకారులను చిన్నచూపు చూస్తూ అస్తిత్వాన్ని దెబ్బతీసే యత్నాలకు పాల్పడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. గద్దర్ అవార్డుల్లోనూ తెలంగాణ కళాకారులకు అన్యాయం జరిగిందని విమర్శలొచ్చాయి.