CM Revanth Reddy | కొడంగల్, అక్టోబర్ 25: అది సాక్షాత్తూ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గం.. సీఎంకు అత్యంత సన్నిహితుడైన కాంగ్రెస్ నేత.. అందునా కాంగ్రెస్ మండలాధ్యక్షుడు.. ఫార్మా కంపెనీల ఏర్పాటుకు తమ భూములు తీసుకోవద్దంటూ వేడుకున్న గిరిజన రైతుల ముందు అధికార దర్పాన్ని ప్రదర్శించాడు..‘మీరు ఇవ్వకున్నా ప్రభుత్వం గుంజుకుంటుంది’అని బెదిరిస్తూ దుర్భాషలాడాడు. దీంతో కడుపు మండిన గిరిజన రైతులు కన్నెర్ర జేశారు. గిరిజన మహిళలు చెంగులు చెక్కి కర్రలతో సదరు కాంగ్రెస్ నేతను ఉరికించి కొట్టారు. అతడి కారును ధ్వంసం చేయడంతో పాటు అందులోంచి దించి రెండు చెంపలు ఛెల్లుమనిపించారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దుద్యాల మండలంలోని రోటిబండతండలో శుక్రవారం ఉదయం జరిగిన సంఘటన ఇది.
ఈ హఠాత్పరిణామంతో సదరు కాంగ్రెస్ నేత, దుగ్యాల కాంగ్రెస్ మండలాధ్యక్షుడు శేఖర్ గజగజ వణికిపోయాడు. పోలీసులను రక్షణ వేడుకొని గ్రామ పంచాయతీ కార్యాలయంలో తలదాచుకున్నాడు. అప్పటికీ ఆగ్రహం చల్లారని రైతులు, మహిళలు, యువకులు జీపీ గదిని చుట్టుముట్టారు. పక్కనే ఉన్న హైమాస్ట్ లైట్ స్తంభంతో గది తలుపులు బద్దలుకొట్టేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. ఓవైపు పదుల సంఖ్యలో రైతులు.. మరోవైపు అదేస్థాయిలో పోలీసులు.. ఏం జరుగుతుందోనన్న భీతావహ వాతావరణం నెలకొంది. ఉదయం పది గంటల నుంచి మధ్యాహ్నం మూడు గంటల వరకు సదరు నేత బిక్కచచ్చిపోయి అందులోనే ఉండిపోయాడు. ఎస్పీ, అదనపు కలెక్టర్ వచ్చి రైతులకు నచ్చజెప్పడంతో ఎట్టకేలకు శేఖర్‌ను పోలీసులు అక్కడి నుంచి హైదరాబాద్ తరలించారు. ఈ ఘటనతో ఫార్మా కంపెనీల కోసం లగచర్లలో నిర్వహించాలనుకున్న ప్రజాభిప్రాయ సేకరణ ప్రారంభం కాకుండానే అధికారులు విరమించుకొని తిరుగుముఖం పట్టారు.
775 ఎకరాల కోసం అభిప్రాయ సేకరణ
కొడంగల్ ప్రాంతంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు ప్రభుత్వం గత కొన్ని నెలలుగా కసరత్తు మొదలుపెట్టింది. ఇందులో భాగంగా దుద్యాల మండలం లగచర్ల, హకీంపేట, పోలేపల్లి, రోటిబండతండా, పులిచర్ల కుంట తండాల పరిధిలో 1375 ఎకరాలు సేకరించాలని నిర్ణయించింది. ఇందులో 600 ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉండగా మిగిలిన 775 ఎకరాల వరకు రైతుల వద్ద సేకరించాల్సి ఉన్నది. అందులో భాగంగా దుద్యాల మండలం లగచర్లలో శుక్రవారం ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టారు. ఈ మేరకు స్థానిక అధికారులు టెంట్లు, ఇతర అన్ని ఏర్పాట్లు చేశారు. ఉదయం 9గంటలకు ప్రజాభిప్రాయ సేకరణను ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు.
కానీ ఒక్కసారిగా అక్కడ కలకలం రేగింది. కార్యక్రమంలో పాల్గొనేందుకు దుద్యాల కాంగ్రెస్ మండలాధ్యక్షుడు, సీఎం రేవంత్‌కు అనుచరుడైన శేఖర్ హైదరాబాద్ నుంచి బయలుదేరి వచ్చాడు. గ్రామానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న రోటిబండతండా మీదుగా సమావేశం వద్దకు రావాల్సి ఉండగా తండా వద్ద గిరిజన రైతులు శేఖర్ వాహనాన్ని అడ్డుకున్నారు. ఒకటి, రెండెకరాల చొప్పున భూములు ఉన్న తమను రోడ్డున పడేయొద్దని, ఆది నుంచి ఫార్మా కంపెనీల ఏర్పాటు ప్రతిపాదనను నువ్వే ముందుకు తీసుకుపోతున్నావంటూ రైతులు శేఖర్‌ను నిలదీశారు. వారికి నచ్చజెప్పాల్సిన సదరు నేత తన అధికారదర్పాన్ని ప్రదర్శించినట్టు గిరిజన రైతులు తెలిపారు.
కుల దూషణ చేశాడు.. అందుకే దాడి చేసినం
తాము మొదట శేఖర్ కారుకు అడ్డుగా నిలబడి నినాదాలు చేశామని రైతులు, మహిళలు తెలిపారు. అయితే అతడు కారు అద్దాన్ని కిందికి దించి తమను కులదూషణ చేశాడని చెప్పారు. ‘నేను తలుచుకుంటే ఏమైనా చెయ్యగలను. మీరెంత. మీరు ఒప్పుకున్నా.. లేకున్నా భూములను సర్కార్ బలవంతంగా తీసుకుంటది. నేను ఒక్క మాట చెప్తేచాలు. ఏదో ఇచ్చింది తీసుకొని మూస్కొని ఉండండి. నేను సీఎం రైట్ హ్యాండ్ను తెలుసు కదా’ అంటూ పోజులు కొట్టాడని రైతులు తెలిపారు. కారు దిగి తమపైనే దాడికి యత్నించాడని, అందుకే అతడికి బుద్ధి చెప్పాల్సి వచ్చిందని చెప్పారు. శేఖర్ వాహనంపై దాడి చేయడంతో పాటు అతడిని అందులోంచి దింపి దాడికి దిగారు.
మహిళలు కూడా పెద్ద ఎత్తున వచ్చి కర్రలతో దాడి చేశారు. సమీపంలో ఉన్న ఇద్దరు కానిస్టేబుళ్లు వెంటనే గిరిజన రైతులను అడ్డుకొని శేఖర్‌ను తీసుకెళ్లి తండాలోని పంచాయతీ గదిలో ఉంచి, ఉన్నతాధికారులకు సమాచారమిచ్చారు. అప్పటికే భారీ పోలీసు బలగాలతో లగచర్లలోనే ఉన్న పరిగి డీఎస్పీ కరుణాసాగర్‌రెడ్డి అక్కడికి వెళ్లారు. అప్పటికే శేఖర్‌ను తమకు అప్పగించాని రైతులు గది చుట్టూ గూమిగూడారు. పక్కనే ఉన్న ఇనుప స్తంభం (పోల్)ను తీసుకొని తలుపులు బద్దలు కొట్టేందుకు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. చివరికి లాఠీచార్జీ చేయడంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
హుటాహుటిన తండాకు ఉన్నతాధికారులు
ఎస్పీ నారాయణ, అదనపు కలెక్టర్ లింగానాయక్ వచ్చి తండా రైతులతో సమావేశమయ్యారు. వారికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుల దూషణ చేసి తమ ఆత్మగౌరవాన్ని దెబ్బతీసినందునే శేఖర్‌పై దాడి చేశామని రైతులు వివరించారు. తమ తాతలు తిండి తినక కూడబెట్టి కొన్న భూములను ప్రభుత్వానికి అప్పనంగా ఎందుకివ్వాలని ప్రశ్నించారు. పచ్చని పొలాల్లో కంపనీలు పెట్టి తమ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఏనాడూ తాము కోరలేదని చెప్పారు. తమ ప్రశాంతతను దెబ్బతీసి 8 నెలలుగా నిద్ర లేకుండా చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. దీనంతటికీ ఈ ప్రాంత కాంగ్రెస్ నాయకులే కారణమని, రైతులెవరినీ సంప్రదించకుండా ఈ ప్రాంతంలో సెంటు భూమి కూడా లేని శేఖర్, శ్రీనివాస్ (హకీంపేట), సంజీవరెడ్డి (హకీంపేట), నర్సింహ (పోలేపల్లి), సింగర్ నర్సింహ (పోలేపల్లి) ఫార్మా కంపెనీల ఏర్పాటు కోసం కుట్రలు చేస్తున్నారని రైతులు ఆరోపించారు.
8నెలల కిందటే వీరితో పాటు దుద్యాల తహసీల్దార్ వెంకటేశ్ ప్రసాద్, కొడంగల్ తహసీల్దార్ విజయ్‌కుమార్, టీఎస్ఐఐసీ అధికారి శ్రవణ్‌కుమార్ సమావేశమై… రైతులకు సంబంధం లేకుండానే ఈ ప్రాంతంలో ఫార్మా కంపెనీల ఏర్పాటుకు తీర్మానం చేసినట్టు ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఆయన సోదరుడు తిరుపతిరెడ్డి ఏనాడూ రైతులతో మాట్లాడిన పాపాన పోలేదని, తమ బాధలను పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. ఎకరాకు రూ.10 లక్షలు, ఇంటికో ఉద్యోగం, 125 గజాల ఇంటి స్థలం ఇస్తామని ఎరేస్తున్నారని, కోట్లాది రూపాయల విలువ చేసే భూములకు ప్రభుత్వం ఇచ్చే రూ.10 లక్షలు ఏ మూలకు సరిపోతాయని నిలదీశారు. రైతుల ఆవేదన విన్న అధికారులు తాము ప్రభుత్వానికి నివేదిస్తామని చెప్పి అభిప్రాయ సేకరణ చేయకుండానే వెళ్లిపోయారు.
పెట్రోల్ పోసుకున్న యువకుడు..!
తమ భూములు కాపాడుకునేందుకు ప్రాణాలైనా అర్పించేందుకు సిద్ధమంటూ ఓ యువకుడు పెట్రోల్ పోసుకునేందుకు ప్రయత్నించాడు. పోలీసులు, స్థానికులు గుర్తించి వెంటనే పెట్రోల్ బాటిల్‌ను లాక్కున్నారు. ‘మా కడుపులు కాలుతున్నయ్.. మా బాధలు ఎవరితో మొరపెట్టుకోవాలి.. మా ఆకలి బాధలు సీఎం పట్టించుకుంటలేడు. మేం ఎవరి జోలికి పోము.. మా జోలికి వస్తే వదిలేది లేదు’ అని యువకుడు హెచ్చరించాడు.