హైదరాబాద్, జూన్ 5 (నమస్తే తెలంగాణ): ముందస్తుగా పలకరించిన నైరుతి రుతుపవనాలు ‘చిన్న విరామం’ తీసుకున్నాయి. ప్రతికూల వాతావరణం కారణంగా రుతుపవన గమనం మందగించింది. దీంతో వర్షాలు పడకపోగా, వాతావరణం మళ్లీ వేడెక్కింది. పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఒకట్రెండు డిగ్రీలు అధిక నమోదవుతున్నాయి. రుతుపవనాల కదలికలు దక్షిణ భారతదేశం, ఈశాన్య రాష్ర్టాల దగ్గర ఆగిపోయాయి. వాయవ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ తీవ్ర వాయుగుండమే ఇందుకు ప్రధాన కారణమని వాతావరణశాఖ ప్రకటించింది. రుతుపవనాల విస్తరణకు అవసరమైన తేమ వెళ్లిపోవడం వల్లనే పొడిగాలులు వీస్తున్నాయని పేర్కొన్నది.
మరో వారంపాటు నైరుతి రుతుపవనాల పురోగమనం కష్టమేనని వాతావరణశాఖ అధికారులు అభిప్రాయం వ్యక్తంచేస్తున్నారు. ఇదేమీ అనూహ్యమైన పరిణామం కాదని, రుతుపవనాలు విస్తరించేటప్పుడు మధ్యలో కొన్నిరోజుల విరామం సాధారణమేనని తెలిపారు. ఈనెల 12 తర్వాత తొలకరి విస్తరించడం మొదలయ్యే అవకాశముందని చెప్పారు. నైరుతి రుతుపవనాలు విరామం తీసుకోవడంతో రాష్ట్రంలో సాధారణం కంటే రెండు మూడు డిగ్రీల పగటి ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయని తెలిపారు. మరో వారంపాటు ఇదే పరిస్థితి కొనసాగుందని ఐఎండీ అధికారులు స్పష్టంచేశారు.