నువ్వులు.. నూనెగింజల పంటల్లో ప్రధానమైనది. వేసవి సాగుకు అనుకూలమైనది. ఫిబ్రవరి మొదటివారంలో విత్తుకొని, అతితక్కువ సమయంలోనే అధిక లాభాన్ని ఆర్జించేందుకు ఈ పంట ఉపకరిస్తుంది. వర్షాధారంగా సాగు చేసేకన్నా, వేసవిలో ఆరుతడి పంటగా వేయడం వల్ల విత్తన నాణ్యతతోపాటు దిగుబడి కూడా పెరుగుతుంది. చీడపీడల సమస్యా తగ్గుతుంది. అందుకే, నువ్వులను ఇప్పుడు సాగు చేస్తే, అధిక ఆదాయం పొందే అవకాశం ఉన్నది.
నేల ఎంపిక.. తయారీ
మురుగు నీరు నిల్వ ఉండని నల్లరేగడి, తేలికపాటి నేలలు నువ్వుల సాగుకు అనుకూలం. అయితే, నీరు నిలుస్తూ, ఆమ్ల, క్షార గుణాలుండే నేలల్లో ఈ పంట వేయకపోవడమే మంచిది. అనుకూలమైన నేలల్లో దుక్కిని బాగా చదును చేసి, పొడి దుక్కి ఉండేలా చేసుకోవాలి. దీనివల్ల విత్తనాలు బాగా మొలకెత్తి, మొలకశాతం పెరుగుతుంది.
విత్తన రకాలు : జగిత్యాల జిల్లా పొలాసలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం విడుదల చేసిన తెల్ల రంగు గింజ నువ్వు రకాలు వేసవికి అనుకూలంగా ఉంటాయి. ఇందులో రాజేశ్వరి, శ్వేత (జేసీఎస్-96), హిమ (జేసీఎస్-9426), చందన ముఖ్యమైనవి. రకాన్ని బట్టి ఎకరానికి రెండు కిలోల విత్తనాలు అవసరం అవుతాయి. వీటికి 7-10 కిలోల సన్నని పొడి ఇసుకను కలుపుకొని, పొలంలో సమంగా చల్లుకోవాలి. లేదా గొర్రు సాయంతో వరుసల్లో విత్తుకోవాలి. అయితే, వరుసల మధ్య దూరం 30 సెం.మీ. ఉండేలా చూసుకోవాలి.
విత్తనశుద్ధి
కిలో విత్తనానికి 3 గ్రా. థైరమ్ లేదా మ్యాంకోజెబ్, లేదా 2 గ్రా. ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యూఎస్ కలుపుకొని శుద్ధి చేసుకోవాలి. మొదటగా తెగుళ్ల మందుతో, ఆ తర్వాత పురుగు మందుతో విత్తనశుద్ధి చేసుకోవడం మంచిది.
నీటి యాజమాన్యం
విత్తనాలు వేసిన వెంటనే నీటితడిని తప్పకుండా ఇవ్వాలి. లేకుంటే, మొలక శాతంపై ప్రభావం పడుతుంది. పూత దశ, కాయ వృద్ధితోపాటు గింజ కట్టే దశల్లోనూ నీటి తడులు ఇవ్వాల్సి ఉంటుంది. విత్తిన తర్వాత 35-40 రోజుల నుంచి 65-70 రోజుల వరకూ ఎలాంటి నీటి ఎద్దడి లేకుండా చూసుకోవాలి.
సస్యరక్షణ
వేసవిలో చీడపీడల సమస్య తక్కువే అయినా, కొన్నిరకాల చీడలు ఆశించే అవకాశముంది. అందుకే సరైన సమయంలో సస్యరక్షణ చర్యలు చేపడితే, అధిక దిగుబడులు పొందే అవకాశం ఉన్నది.
గడ్డి చిలుక : మొక్కల మొదళ్లను గడ్డి చిలుకలు కొట్టేస్తాయి. దీంతో వాటి ఎదుగుదల పూర్తిగా ఆగిపోతుంది. రక్షక పంటగా జొన్నను వేయడంతోపాటు గట్ల వెంట కలుపు లేకుండా చూసుకోవాలి. వీటి ఉధృతి ఎక్కువైనప్పుడు లీటర్ నీటిలో 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ కలిపి పిచికారీ చేయాలి.
ఆకుముడత / కాయతొలుచు పురుగు : పైరు లేత దశలో ఉండగా, ఈ పురుగులు దాడి చేస్తాయి. చిన్నచిన్న గొంగళి పురుగులు 2-3 ఆకులను దగ్గరకు చేర్చి, గూడు కట్టుకొంటాయి. ఆకుల్లోని పచ్చ పదార్థాన్ని గోకి తినడం వలన అవి ఎండిపోతాయి. మొగ్గ ఏర్పడే దశలో పూమొగ్గలను, పూతతోపాటు కాయల్లోని గింజలనూ తింటూ, పంటకు తీవ్రమైన నష్టం కలుగజేస్తాయి. వీటి నివారణకు లీటర్ నీటిలో 2.5 మి.లీ. క్లోరిపైరిఫాస్ లేదా 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి.
రసం పీల్చే పురుగులు : వేసవిలో పేనుబంక ఉధృతి ఎక్కువ. దీని నివారణకు లీటర్ నీటిలో 1.6 మి.లీ. మోనోక్రోటోఫాస్ లేదా 0.3 మి.లీ. ఇమిడాక్లోప్రిడ్ లేదా 1.5 గ్రా. ఎసిఫేట్ కలిపి పిచికారీ చేయాలి. లీటర్ నీటిలో 5మి.లీ. డైకోఫాల్ లేదా 2 మి.లీ. డైమిథోయేట్ కలిపి పిచికారీ చేస్తే తెల్లనల్లిని నివారించవచ్చు.
ఆకుమచ్చ తెగుళ్లు : నువ్వుల పంటకు సర్కోస్పొరా, ఆల్టర్నేరియా ఆకు మచ్చల తెగుళ్లు ఆశించే అవకాశం ఉంటుంది. వీటివల్ల ఆకుల కింద ముదురు గోధుమ రంగు, బూడిద రంగులో మచ్చలు ఏర్పడి ఆకు మొత్తం వ్యాపిస్తాయి. తీవ్రత ఎక్కువై ఆకులు ఎండిపోతాయి. కొన్ని మచ్చలు కాండంతోపాటు కాయల మీదా వ్యాపిస్తాయి. దీనివల్ల గింజ నాణ్యత, దిగుబడి గణనీయంగా తగ్గిపోతుంది. ఈ తెగుళ్ల నివారణకు ముందే విత్తనశుద్ధి చేయాలి. కిలో విత్తనానికి 3 గ్రా. మ్యాంకోజెబ్ లేదా కాప్టాన్ కలిపి విత్తనశుద్ధి చేయాలి. ఒకవేళ చేనులో తెగులును గుర్తించినట్లయితే, లీటర్ నీటిలో 2.5 గ్రా. కార్బెండజిమ్ + మ్యాంకోజెబ్ కలిసి ఉన్న మందు లేదా 1 మి.లీ. ప్రొపికొనజోల్ కలిపి 7-10 రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి.
బూడిద తెగులు : రాత్రి ఉష్ణోగ్రతలు తగ్గడం, గాలిలో ఎక్కువ తేమ, మంచు కురవడం వల్ల బూడిద తెగులు ఉధృతి కనిపిస్తుంది. దీని నివారణకు తొలిపూత దశలో లీటర్ నీటిలో 1 గ్రా. మైక్లోబ్యుటానిల్ లేదా 3 గ్రా. నీటిలో కరిగే గంధకం కలిపి పిచికారీ చేయాలి.
కాండం కుళ్లు తెగులు : ఈ తెగులుతో ఆకులు పసుపు రంగులోకి మారి, రాలిపోతాయి. మొక్కల వేర్లు కుళ్లిపోతాయి. మొక్కల కాండంపై గులాబీ రంగు శిలీంధ్రం పెరుగుదల కనిపిస్తుంది. పంట మార్పిడి, విత్తన శుద్ధి ద్వారా వెర్రి తెగులు నివారించవచ్చు.
పంట కోత, నిల్వ : మొక్కల ఆకులు రాలడం మొదలైనప్పుడు, కాయలు 75% పసుపు రంగులోకి మారిన తర్వాత పంట కోత చేపట్టాలి. కోసిన మొక్కలను టార్పాలిన్పై తలకిందులుగా నిలబెట్టి, వారంపాటు ఎండబెట్టాలి. బాగా ఎండిన తర్వాత కర్రలతో కొట్టి గింజలను నూర్పిడి చేయాలి. అప్పుడే గింజల నాణ్యత బాగుంటుంది. తేమశాతం 8 కి తగ్గే వరకూ గింజలను ఎండలో ఆరబెట్టాలి. గోనె సంచుల్లో నింపి, అన్ని వైపుల నుంచీ గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో నిల్వ చేయాలి.
ఎరువుల యాజమాన్యం
నువ్వులు విత్తడానికి ముందే, ఆఖరి దుక్కిలో ఒక ఎకరానికి 4 టన్నుల చొప్పున బాగా చివికిన పశువుల ఎరువు లేదా, ఒక టన్ను వర్మీకంపోస్ట్ వేసుకొని, కలియ దున్నుకోవాలి. అలాగే, దుక్కిలో ఎకరానికి 12 కిలోల నత్రజని, 8 కిలోల భాస్వరం, పొటాష్ ఇచ్చే ఎరువులు వేసుకోవాలి. భాస్వరాన్ని సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వేసుకుంటే, గింజ నాణ్యతతోపాటు నూనెశాతం కూడా పెరుగుతుంది. 30 రోజులకు మొదటి కలుపు తర్వాత నీటి తడి పెట్టుకొని, ఎకరానికి 25 కిలోల యూరియా, 15 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ కలుపుకొని, మొక్కల మొదళ్లలో వేయాలి.
కలుపు నివారణ
నువ్వుల సాగులో కలుపు నివారణ తప్పనిసరి. విత్తనాలు వేసిన 48 గంటల్లోపు లీటర్ నీటిలో 5 మి.లీ. అలాక్లోర్ 50% లేదా 67 మి.లీ. పెండిమిథాలిన్ 30% కలుపుకొని పిచికారీ చేయాలి. ఇందుకోసం ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణం అవసరం పడుతుంది. 20 రోజుల తర్వాత అదనపు మొక్కలను తొలగించి, చేనును పలుచన చేయాలి. మొక్కలు ఒత్తుగా ఉన్నట్లయితే కొమ్మలు, ఆకులు మాత్రమే ఏర్పడి, పూత, కాత ఎక్కువగా రాదు. విత్తనాలు వేసిన 30 రోజుల వరకూ చేనులో ఎలాంటి కలుపు లేకుండా చూసుకోవాలి.