హైదరాబాద్ సిటీబ్యూరో, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ): దేవాదాయ శాఖలో ఉన్నతాధికారులు అడ్డగోలుగా దోపిడీకి తెగబడుతున్నారు. దేవుడికి మొక్కులు చెల్లించుకోకున్నా ఫర్వాలేదు కానీ తమకు ముడుపులు చెల్లించకుంటే ఏ పనీ కాదని తేల్చిచెప్తున్నారు. అలా ఉద్యోగుల బదిలీలు, పదోన్నతులు మొదలుకొని అర్చక ఉద్యోగులకు అమలుచేసే సంక్షేమ పథకాల వరకు అడుగడుగునా అందినకాడికి లంచాలు దండుకుంటున్నారు. తాజాగా ఫుల్ డిమాండ్ ఉన్న ధూప, దీప, నైవేద్య (డీడీఎన్) పథకం రావడంతో ఇష్టారాజ్యంగా దోపిడీ ప్రారంభించారు. ఈ పథకం కింద రాష్ట్రంలో ధూప, దీప, నైవేద్యాలకు నోచుకోని ఆలయాల నిర్వహణ కోసం అక్కడి అర్చకుడికి ప్రతినెలా రూ.10 వేలు ఇస్తారు. ఈ పథకం అమలులో భాగంగా మంత్రులు చెప్పిన ఒకట్రెండు సిఫారసులకు అధికారులు ఓకే చెప్పి మిగతా పనులకు ‘రేటు’ నిర్ణయించారు. డీడీఎన్ జాబితాలో మీ పేరు ఉండాలంటే మంత్రి పేషీ అధికారిని కలవాలంటూ జిల్లా స్థాయిలో తమకు అనుకూలురైన కొందరు అధికారులతో దరఖాస్తుదారులకు చెప్పించారు.
అనంతరం అక్కడికి వెళ్లిన ఓ నిరుపేద అర్చకుడు ఆ ‘సార్’ చెప్పిన రేటుకు అటోఇటో మాట్లాడుకుందామనుకున్నా ‘రాజు’గారు ఒప్పుకోలేదు. దీంతో ఆ అభాగ్యుడు తన భార్య పుస్తెలు తాకట్టుపెట్టి ఆ ‘సార్’ చెప్పిన వ్యక్తికి లక్షల రూపాయల ముడుపు చెల్లించాడు. ఈ వ్యవహారంపై రాష్ట్రవ్యాప్తంగా చర్చ జరుగుతున్నది. డీడీఎన్ పథకాన్ని ఆదాయవనరుగా మార్చుకుని మంత్రి పేషీ అధికారులు కోట్ల రూపాయలు దండుకుంటున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలోని 5 వేలకుపైగా ఆలయాలకు పూర్వవైభవాన్ని తీసుకొచ్చేందుకు ప్రవేశపెట్టిన ధూప, దీప, నైవేద్య పథకం కింద గతంలో అర్చకులకు నెలవారీగా ఇస్తున్న రూ.6 వేలను కేసీఆర్ హయాంలో రూ.10 వేలకు పెంచారు. ఆ తర్వాత 2023లో మరో 250 ఆలయాలకు ఈ పథకాన్ని విస్తరించాలని నిర్ణయించినప్పటికీ ఎన్నికల కోడ్ వల్ల ఆ ప్రక్రియ ఆగిపోయింది. అనంతరం అధికారంలోకి వచ్చిన రేవంత్రెడ్డి సర్కారు ఆ 250 ఆలయాలకు డీడీఎన్ పథకాన్ని వర్తింపజేసేందుకు ఈ ఏడాది మే నెలలో నోటిఫికేషన్ జారీచేసింది. దీంతో ఆ పథకానికి తమ ఆలయాలను ఎంపిక చేయాలని కోరుతూ రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 4,600 మంది నిరుపేద అర్చకులు దరఖాస్తు చేసుకున్నారు. వాటిని పరిశీలించేందుకు ప్రభుత్వం జిల్లాస్థాయిలో అడిషనల్ కలెక్టర్ నేతృత్వంలో ప్రత్యేక కమిటీలను నియమించింది. చివరికి ఆ కమిటీలు 1,326 దరఖాస్తులను ఎంపికచేసి, తుదిజాబితాను దేవాదాయ శాఖ కమిషనర్ కార్యాలయానికి పంపాయి. అసలు కథ ఇక్కడే మొదలైంది.
మంత్రి పేషీ నుంచే ముడుపుల దందా
డీడీఎన్ పథకానికి కొత్తగా ఎంపిక చేయాలనుకున్న ఆలయాలపై జోరుగా పైరవీలు నడిచాయి. తాము అనుకున్న ఆలయాలను ఈ పథకానికి ఎంపిక చేయాలని దేవాదాయ శాఖ అధికారులపై పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఇతర ప్రజాప్రతినిధులు ఒత్తిడి తీసుకొచ్చారు. వారి సిఫారసు లేఖలతో దరఖాస్తుదారులు దేవాదాయ శాఖ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేశారు. అక్కడ ఫలితం లేకపోడంతో కొందరు దరఖాస్తుదారులు నేరుగా మంత్రి పేషీ అధికారుల వద్దకే వెళ్లి ఒక్కో ఆలయానికి రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల వరకు ముడుపులు సమర్పించుకున్నట్టు తెలిసింది.