హైదరాబాద్, డిసెంబర్ 15 (నమస్తే తెలంగాణ) : ప్రపంచ ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీ (Lionel Messi) హైదరాబాద్ టూర్లో నిధుల లూటీ కలకలం రేగుతున్నది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి (Revanth Reddy) రియల్ ఎస్టేట్ భాగస్వామి అనిల్ రెడ్డి భార్య నూకలపాటి పార్వతిరెడ్డి భారీ ఎత్తున నిధులు కాజేసినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ‘ఎన్‌ఏఆర్ ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ’కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా పనిచేస్తున్న ఆమె ప్రత్యేక ఈవెంట్ల పేరుతో దాదాపుగా రూ.45 కోట్లు వసూలు చేసినట్టు ఆరోపణలొస్తున్నాయి. ఈ నెల 13 ఉప్పల్‌లో జరిగిన మెస్సీ భారీ ఈవెంట్‌కు పార్వతిరెడ్డి చీఫ్ ప్యాట్రన్, అడ్వైజర్‌గా వ్యవహరించారు. తన రియల్ ఎస్టేట్ పార్ట్నర్ భార్య కావడంతో ఆమె అర్హతలు ఏవీ పట్టించుకోకుండా సీఎం రేవంత్‌రెడ్డి నిర్వహణ బాధ్యతలు ఆమెకు అప్పగించినట్టు తెలిసింది. ఇదే అదునుగా ఆమె ‘హై ప్రొఫైల్ మీట్ అండ్ గ్రీట్’ అనే ప్రత్యేక ఈవెంట్‌ను డిజైన్ చేసి మెస్సీ అభిమానులను మోసం చేసినట్టు తెలిసింది. కార్పొరేట్ సంస్థల నుంచి వ్యాపార ప్రకటనల పేరుతో భారీగా డబ్బు వసూలు చేసినట్టు ఆరోపణలు వస్తున్నాయి.
రోహిన్‌రెడ్డితో కలిసి ఈవెంట్ డిజైన్
ఫుట్‌బాల్ క్లినిక్, లాజిస్టిక్స్ వంటి హై-ప్రొఫైల్ ఈవెంట్‌ను పార్వతిరెడ్డి మెస్సీ ఇంటర్నల్ టీమ్‌తో కలిసి సమన్వయం చేశారు. ఈనేపథ్యంలో ఆమె సీఎం రేవంత్‌రెడ్డి సన్నిహితుడు రోహిన్‌రెడ్డితో కలిసి ప్రత్యేక ఈవెంట్‌ను డిజైన్ చేసినట్టు తెలిసింది. మెస్సీ టూర్లో దేశంలో ఎక్కడా లేని విధంగా హైదరాబాద్‌లో ‘హై ప్రొఫైల్ మీట్ అండ్ గ్రీట్’ అనే ఈవెంట్‌ను రూపొందించారు. మెస్పీ, ఆయన టీమ్ బస చేసిన ఫలక్‌నుమా ప్యాలెస్ వద్దనే ఈ కార్యక్రమం పెట్టారు. మెస్సీతో సింగిల్ ఫొటో సెషన్, సెల్ఫీ సెషన్, లోకల్ అరేంజ్మెంట్లు అంటూ పబ్లిసిటీ చేసి ఒక్కొక్కరి వద్ద రూ.9.95 లక్షలు వసూలు చేసినట్టు సమాచారం. మెస్సీతో సింగిల్ ఫొటో సెషన్‌కు 500 మంది ఔత్సాహికులు తమ పేరు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్టు తెలిసింది. అయితే మెస్సీ కేవలం 29 మందితోనే కరచాలనం చేసి ఫొటోలు దిగి వెళ్లిపోయినట్టు తెలిసింది. రూ.9.95 లక్షలు చెల్లించి పేరు నమోదు చేసుకున్న మిగిలిన 471 మందికి చేదు అనుభవమే ఎదురైనట్టు తెలిసింది.
ప్రకటనల ఒప్పందాలతో డబ్బు సమీకరణ
మరోవైపు అపర్ణ కన్స్ట్రక్షన్, సింగరేణి తరహా కార్పొరేట్ సంస్థలతో వ్యాపార ప్రకటన ఒప్పందాలు చేసుకొని భారీగా డబ్బు సమీకరించినట్టు ప్రచారం జరుగుతున్నది. సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్ కనుసన్నల్లో జరిగిన ఈ వ్యవహారానికి లెక్కాపత్రం ఏమీ లేదని, 20 కోట్ల నుంచి 25 కోట్ల వరకు కార్పొరేట్ సంస్థల ప్రకటనల పేరుతో వసూలు చేసినట్టు ప్రచారం జరుగుతున్నది. మెస్సీతో ఫొటో సెషన్‌కు అవకాశం రాని వా రికి తిరిగి డబ్బు చెల్లించాలని బాధితులు డి మాండ్ చేస్తుండగా, తిరిగి చెల్లించేందుకు పా ర్వతిరెడ్డి గ్యాంగ్ నిరాకరిస్తున్నట్టు తెలిసింది. పైగా బాధితులపైనే బెదిరింపులకు పాల్పడుతున్నట్టు సమాచారం. దీంతో బాధితులు పోలీస్ స్టేషన్‌కు క్యూకట్టగా, అంతర్గత విచారణ చేపట్టినట్టు తెలిసింది. విచారణ సజావుగా జరుగకుండా, విషయం బయటికి రాకుండా సీఎంవో వర్గాలు పోలీసులపై ఒత్తిడి తెస్తున్నట్టు సమాచారం.