నర్సంపేట, అక్టోబర్ 7: కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి అరెస్టు విషయంలో హైడ్రామా నెలకొన్నది. నర్సంపేటకు చెందిన కొంగ మురళి-నాగలక్ష్మి దంపతుల ఇంటికి గత నెల 18న నర్సంపేటకు చెందిన కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ జిల్లా చైర్మన్ ఓర్సు తిరుపతి, అతడి అనుచరులు (తిరుపతి సోదరుని కుమారులు) కొంతమంది కలిసి వచ్చారు. మురళి చిన్న కొడుకు కొంగ వినోద్‌కుమార్‌ను తిరుపతితోపాటు అతడి అనుచరులు కలిసి విచక్షణారహితంగా కొట్టారు. దీనిపై గత నెల 19న మురళి స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. మంగళవారం నర్సంపేట పోలీసులు ఓర్సు తిరుపతిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి అరెస్టు చేశారు.
రిమాండ్‌కు ముందు నిందితుడైన తిరుపతికి వైద్య పరీక్షల నిమిత్తం నర్సంపేటలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలకు తీసుకెళ్లారు. అక్కడ తిరుపతిని వీఐపీ పేషెంట్‌గా వైద్యులు చిత్రీకరిస్తూ అరెస్టు నుంచి తప్పించడానికి నా నా హంగామా చేశారు. తొలుత ఐసీయూలో చేర్చారు. డ్రామా విషయం కాస్తా బయటకు పొక్కడంతో వైద్య బృందం తిరుపతిని హుటాహుటిన ఆంబులెన్స్‌లో వరంగల్ ఎంజీ ఎం దవాఖానకు తరలించారు. గతంలో రౌడీ షీటర్‌గా పేరుగాంచిన తిరుపతిని రిమాండ్‌కు తరలిస్తారా? లేదా అనేది తేలాలి.