హైదరాబాద్, మార్చి 14 (నమస్తే తెలంగాణ): భూదాన్ బోర్డు భూముల వివాదాలను ప్రజాప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే పరిషరించాలని హైకోర్టు అభిప్రాయపడింది. సమాజంలో ఇతర వర్గాలతో సమానంగా గౌరవప్రదమైన జీవనం గడపడానికి అణగారిన, పూట గడవని పేదలకు భూ కేటాయింపుల కోసం ఎందరో దాతలు భూములను భూదాన్ బోర్డుకు ఇచ్చారని గుర్తుచేసింది. ఈ విషయాన్ని విస్మరించరాదని స్పష్టంచేసింది. చట్టం లక్ష్యంతోపాటు వాటిని పొందినవారి హకులను పరిగణనలోకి తీసుకోవడం ముఖ్యం కాబట్టి ప్రభుత్వ వివరణ పరిశీలించాల్సిన అవసరం ఉన్నదని పేరొన్నది. సమగ్ర వివరాలతో కౌంటరు దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం నాగారం గ్రామంలో సర్వే నంబర్ 181లో రూ.వందల కోట్లు విలువ చేసే భూములను భూదాన్ బోర్డుకు చెందినవిగా పేరొంటూ భూదాన్ యజ్ఞ బోర్డు అధీకృత అధికారి ఫిబ్రవరి 28న జారీ చేసిన ఉత్తర్వులతోపాటు సర్వే నంబర్ 181, 182లోని భూములు భూదాన్ బోర్డువేనంటూ 2006 ఏప్రిల్‌లో జిల్లా కలెక్టర్ జారీ చేసిన ఉత్తర్వులను సవాలు చేస్తూ ఈఐపీఎల్ కన్స్ట్రక్షన్ సంస్థ దాఖలు చేసిన పిటీషన్‌ను జస్టిస్ సీవీ భాసర్‌రెడ్డి విచారించారు. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ, గతంలో పలు లావాదేవీలను అనుమతించిన అధికారులు ఇప్పుడు భూములు భూదాన్ బోర్డువని, వాటిని స్వాధీనం చేసుకుని ప్రభుత్వానికి అప్పగించాలనడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. అంతేగాకుండా సర్వే నంబర్ 181, 182లో ఉన్న భూములన్నింటినీ నిషేధిత జాబితాలో ఉంచారని తెలిపారు. కలెక్టర్‌తోపాటు భూదాన్ బోర్డు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు.
వాదనలు విన్న తర్వాత హైకోర్టు స్పందిస్తూ.. భూదాన్ బోర్డు నిబంధనలకు విరుద్ధంగా లావాదేవీలు జరిగాయన్న కారణంగా భూమిని స్వాధీనం చేసుకుంటున్నట్టు అధికారులు చెప్తున్నారని పేర్కొన్నది. గతంలో భూమి యజమానులు పేదల సంక్షేమం కోసం ఆయా భూములను గ్రామసభకు అప్పగించారని, అర్హులైన వారిని గుర్తించి వ్యవసాయం చేసుకోవడానికి భూమిని కేటాయించాల్సి ఉన్నదని అభిప్రాయపడింది. ఈ భూమిని పొందినవారు అన్యాక్రాంతం చేయడానికి వీల్లేదని, అయితే వారసత్వం కింద కొనసాగించవచ్చునని స్పష్టంచేసింది. పిటిషనర్ అభ్యంతరాల నేపథ్యంలో ప్రభుత్వ వాదనను వినాల్సి ఉన్నదని పేరొన్నది. ప్రతివాదులైన రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఈ నెల 27కు వాయిదా వేసింది.