హైదరాబాద్, జనవరి 27 (నమస్తే తెలంగాణ): తమ ఆదేశాలను అమలుచేయకుండా బదిలీపై వెళ్లిపోయామని చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకోజాలరని ప్రభుత్వ అధికారులను హైకోర్టు హెచ్చరించింది. కోర్టు ఆదేశాలు వెలువడ్డాక అమలు చేయకుండా ఇప్పుడు బదిలీ అయ్యామని, తమకు సంబంధం లేదంటే కుదరదని తేల్చి చెప్పింది. కోర్టు ఆదేశాలను ఫైళ్లలో పెట్టేసి తాము బదిలీపై వెళ్లిపోయామంటే ఎలాగని ప్రశ్నించింది. మిడ్ మానేరు ప్రాజెక్ట్ కోసం పిటిషనర్ నుంచి సేకరించిన భూమికి మూడు నెలల్లో పరిహారం చెల్లిస్తామని హైకోర్టుకు ఇచ్చిన హామీని అమలుచేయని అప్పటి రెవెన్యూశాఖ కార్యదర్శి నవీన్ మిట్టల్, అప్పటి సిరిసిల్ల కలెక్టర్ సందీప్‌కుమార్ ఝా మార్చి 24న వ్యక్తిగతంగా హైకోర్టు విచారణకు హాజరుకావాల్సిందేనని ఆదేశించింది. పిటిషనర్‌కు ఎనిమిది వారాల్లో పరిహారం చెల్లించాలని ఆదేశించింది. మిడ్ మానేరు ప్రాజెక్టు ముంపునకు గురైన 2.01 ఎకరాల భూమిని అధికారులు 2010లో భూసేకరణ ద్వారా స్వాధీనం చేసుకున్నారు.
తనకు పరిహారంగా ఇంటి జాగ, వ్యవసాయేతర భూమి 2,783 చదరపు గజాలు ఇవ్వలేదంటూ బీ రామవ్వ పిటిషన్ దాఖలు చేశారు. మూడు మాసాల్లో పరిహారం చెల్లిస్తామని అధికారుల హామీని గతంలో హైకోర్టు రికార్డుల్లో నమోదు చేసి పిటిషన్‌పై విచారణను ముగించింది. ఐదు నెలలు గడిచినా పరిహారం చెల్లించకపోవడంతో రామవ్వ దాఖలుచేసిన కోర్టు ధికరణ పిటిషన్‌పై జస్టిస్ శ్రవణ్‌కుమార్ మంగళవారం విచారణ జరిపారు. గత విచారణలో ఆదేశించిన మేరకు ఇద్దరు ఐఏఎస్ అధికారులు విచారణకు హాజరుకాకపోవడంతో ఆగ్రహం వ్యక్తంచేశారు. హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోరుతూ సీసీఎల్ఏ లోకేశ్‌కుమార్, సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగర్వాల్ వేసిన పిటిషన్లను అనుమతించారు. ప్రభుత్వ న్యాయవాది స్పందిస్తూ, నవీన్ మిట్టల్, సందీప్‌కుమార్ బదిలీ అయ్యారని చెప్పడంపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తంచేశారు. ఇచ్చిన హామీని అమలు చేయకపోవడంపై స్పందించాలని అన్నారు. మూడు నెలల్లో పరిహారం చెల్లిస్తామన్న హామీని ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. పిటిషనర్ వయసు 75 ఏండ్లని గుర్తు చేసింది. ఎనిమిది వారాల్లో పరిహారం చెల్లించాలని ఆదేశించారు. నవీన్ మిట్టల్, సందీప్‌కుమార్ మార్చి 24న జరిగే విచారణకు స్వయంగా హాజరుకావాల్సిందేనని తేల్చి చెప్పారు.