హైదరాబాద్, నవంబర్ 21 (నమస్తే తెలంగాణ) : పీజీ మెడికల్ అడ్మిషన్లలో మేనేజ్మెంట్ కోటాలో ఈ ఏడాది రిజర్వేషన్లు వర్తించవని హైకోర్టు తేల్చిచెప్పింది. ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనారిటీ, నాన్‌మైనారిటీ కళాశాలల్లోని పీజీ మెడికల్, డెంటల్ కోర్సుల్లో ప్రస్తుత అడ్మిషన్లకు రిజర్వేషన్లు వర్తించవని స్పష్టంచేసింది. మేనేజ్మెంట్ కోటా సీట్లలో స్థానికులకు 85%, ఆలిండియాకు 15% కోటా కల్పిస్తూ ప్రభుత్వం సవరించిన నిబంధనలు ఈ అడ్మిషన్లకు వర్తించవని పేరొంది. నాలుగు వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని ప్రభుత్వం, కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 19కి వాయిదా వేసింది. పీజీ మెడికల్, డెంటల్ కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా అడ్మిషన్లలో స్థానికులకు 85%, ఆలిండియా కోటా 15% రిజర్వేషన్లకు అనుగుణంగా నిబంధనలు సవరిస్తూ నవంబరు 3న ప్రభుత్వం జారీచేసిన జీవో 200, 201లను సవాలు చేస్తూ బెంగళూరుకు చెందిన స్వరూప్‌తోపాటు, రాజస్థాన్, తిరుపతి తదితర ప్రాంతాలకు చెందిన పలువురు అభ్యర్థులు హైకోర్టులో రెండు పిటిషన్లు దాఖలు చేశారు.
వీటిపై చీఫ్ జస్టిస్ అపరేశ్‌కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన బెంచ్ శుక్రవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలు వినిపిస్తూ పీజీ మెడికల్ అడ్మిషన్ల ప్రక్రియను ప్రారంభిస్తూ అక్టోబరు 4న యూనివర్సిటీ నోటిఫికేషన్ జారీ చేసిందని తెలిపారు. అనంతరం ప్రైవేట్, అన్ఎయిడెడ్, మైనారిటీ, నాన్ మైనారిటీ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటా కింద పీజీ మెడికల్ అడ్మిషన్లకు సంబంధించిన నిబంధనలను సవరించిందని చెప్పారు. నివాసం ఆధారంగా ఎంబీబీఎస్ సీట్లను కేటాయించవచ్చని, పీజీ స్థాయిలో కాదంటూ డాక్టర్ తన్వీ బీఈహెచ్ఎల్ వర్సెస్ శ్రేయ గోయల్ కేసులో సుప్రీంకోర్టు స్పష్టంగా వెల్లడించిందని గుర్తుచేశారు. ప్రస్తుత రిజర్వేషన్లతో పిటిషనర్లకు నష్టం వాటిల్లుతుందని చెప్పారు. ఇరుపక్షాల వాదనలను విన్న బెంచ్ ప్రస్తుత అడ్మిషన్లకు రిజర్వేషన్లు వర్తించవని మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది.