హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): రంగారెడ్డి జిల్లా నాగారంలోని 181, 182, 194, 195 సర్వే నంబర్లలోని భూదాన్ భూముల అన్యాక్రాంతంపై విచారణ కమిషన్ వేయాలో? లేదో? తేలుస్తామని హైకోర్టు స్పష్టంచేసింది. ఇరుపక్షాల వాదనలు ముగియడంతో తీర్పు వాయిదా వేసింది. ఇదే సర్వే నంబర్లలో ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అక్రమంగా భూములు తమ పేరిట నమోదు చేసుకున్నారని, ఈ వ్యవహారంపై సీబీఐ, ఈడీ దర్యాప్తునకు ఆదేశించాలంటూ దాఖలైన పిటిషన్లపై విచారణ ముగిసింది.
నాగారం సర్వే నంబర్ 181, 194, 195లో భారీ భూకబ్జాలపై అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని అంబర్‌పేటకు చెందిన బిల్ల మహేశ్, సర్వే నంబర్ 194, 195లోని భూమిని ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు అక్రమంగా పట్టా చేసుకున్నారన్న వ్యవహారంపై విచారణ కమిషన్ వేయాలని రాములు పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జస్టిస్ కే లక్ష్మణ్ గురువారం విచారణ పూర్తిచేశారు. పిటిషనర్ తరఫున జే విజయలక్ష్మి వాదనలు వినిపిస్తూ.. ‘194/ఐ, 195/ఐలో రాములు భూములున్నాయి.
ఆ భూములు అతడి ఆధీనంలోనే ఉన్నాయి. పాస్‌బుక్ అతడి పేరిటే ఉన్నా.. భూభారతిలో మాత్రం జావేద్, అర్షియా సుల్తానా, అబ్దుల్ లతీఫ్ పేర్లు చూపిస్తున్నది. తనకు తెలియకుండా ఆన్లైన్లో ఎలా మార్చారో చెప్పాలని తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించినా వివరాలు వెల్లడించలేదు. కోర్టు ఆదేశించినా స్పందనలేదు. ఉన్నతాధికారులకు వినతిపత్రాలు సమర్పించినా స్పందన లేక కమిషన్ వేస్తే గానీ వివరాలు బహిర్గతం కావని కోర్టును ఆశ్రయించాం’ అని తెలిపారు. మహేశ్ దాఖలు చేసిన పిటిషన్లో తాము వేసిన మధ్యంతర అప్లికేషన్‌పై ఉత్తర్వులు వెలువరించాలని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. ఈ ఐఏతోపాటు మరికొన్ని ఐఏల్లో ఉత్తర్వులిస్తామని చెప్తూ.. తీర్పు వాయిదా వేశారు.