హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : అనార్యోగం వంటి తీవ్రమైన కారణాల వల్ల కాలేజీకి హాజరుకాలేకపోయామని, తమను పరీక్షలకు అనుమతించాలని విద్యార్థులు కోరడాన్ని హైకోర్టు తప్పుపట్టింది. జీవితంలో ఎన్నో ఒడిదొడుకులు ఎదురౌతాయని, మరెన్నో అడ్డంకులు వస్తుంటాయని వీటిని ధైర్యంగా ఎదురొని ముందుకు వెళ్లాలని హితవు చెప్పింది. సమస్యలను దీటుగా ఎదురొని పరీక్షలకు హాజరుకాలేకపోతే ఎలాగని ప్రశ్నించింది. యూపీఎస్సీ తదితర ఉన్నత స్థాయి పదవుల కోసం జరిగే పోటీ పరీక్షలకు తొలి ప్రయత్నంలో ఉత్తీర్ణులు కాలేనివారు చాలామందే ఉంటారని, ఆ తర్వాత కృషి ఫలితంగా విజయం సాధించిన వారున్నారని గుర్తుచేసింది. అనారోగ్యం కారణంగా విద్యార్థిని పరీక్షలకు అనుమతిస్తే, రేపు మరొకరు ఇలాంటి కారణాలతో ముందుకు వస్తారని చెప్పింది. హాజరు శాతం నిబంధనల విషయంలో జోక్యం చేసుకోలేమని స్పష్టం చేసింది. యూనివర్సిటీ నిబంధనలను కోర్టులు తిరగ రాయబోవని తెలిపింది. హాజరు నిబంధనలను యూనివర్సిటీలు రూపొందిస్తాయని పేర్కొంది. సాధారణంగా 75 శాతం హాజరు అవసరమని, అనారోగ్యం, క్రీడలు, ఎన్సీసీ వంటి ప్రత్యేక పరిస్థితుల్లో 10 శాతం వరకే మినహాయింపు ఉంటుందని, దీనికి మించి అనుమతించేందుకు వీల్లేదనే నిబంధన ఉందని గుర్తుచేసింది.
హైదరాబాద్‌కు చెందిన కే మాన్విత అనారోగ్యంతో కాలేజీకి వెళ్లకపోవడంతో హాజరు శాతం తగ్గినప్పటికీ ఆమెను బీటెక్ మూడో సంవత్సరం 2వ సెమిస్టర్ పరీక్షలకు అనుమతించాలని సింగిల్ జడ్జి గతంలో తీర్పు చెప్పారు. ఆ ఉత్తర్వులను రద్దు చేయాలంటూ మేడ్చల్ మలాజిగిరి జిల్లాలోని గీతాంజలి కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (అటానమస్) అప్పీల్ చేసింది. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఏకే సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీన్‌తో కూడిన ధర్మాసనం బుధవారం విచారణ జరిపింది. సింగిల్ జడ్జి ఆదేశాలను అమలు చేస్తే ఎంతోమంది విద్యార్థులు కోర్టు ద్వారా పరీక్షలకు అనుమతించాలని కోరే అవకాశాలు ఉంటాయని యూనివర్సిటీ తరఫు న్యాయవాది చెప్పారు. విద్యార్థి తరఫు న్యాయవాది స్పందిస్తూ.. ప్రత్యేక పరిస్థితుల్లో పరీక్షలకు అనుమతించాలని కోరారు. వాదనల అనంతరం ద్విసభ్య ధర్మాసనం.. సింగిల్ జడ్జి వెలువరించిన ఉత్తర్వులను రద్దు చేస్తున్నట్టు ప్రకటించింది. కాలేజీ చేసిన అప్పీల్‌ను అనుమతిస్తున్నట్టు వెల్లడించింది. 2026 జనవరి నుంచి ప్రారంభమయ్యే మూడో సంవత్సరం 2వ సెమిస్టర్లో జూనియర్ విద్యార్థులతోపాటు పిటిషనర్ చదువు పూర్తి చేయాలని తెలిపింది.