హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తేతెలంగాణ) : జీవో-9పై హైకోర్టు స్టే తీవ్ర నిరాశ కలిగించిందని మంత్రి వాకిటి శ్రీహరి తెలిపారు. గురువారం హైకోర్టు వద్ద ఆయన మీడియాతో మాట్లాడు తూ.. బీసీ బిడ్డలు ఎవరూ అధైర్యపడొద్దని, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఇచ్చినమాట మేరకు రిజర్వేషన్లు సాధిస్తామని స్పష్టంచేశారు. హైకోర్టు స్టే ఇవ్వకుండా ఉండేందుకు ఎంతో ప్రయత్నించినట్టు చెప్పారు. కోర్టు నిర్ణయం బీసీల నోటికాడి ముద్దను లాగేసినట్టు అయిందని ఆవేదన వ్యక్తంచేశారు. కోర్టు తీర్పు కాపీ చూశాక న్యాయనిపుణుల సలహాల మే రకు ముందుకెళ్తామని స్పష్టంచేశారు.
హైదరాబాద్, అక్టోబర్ 9 (నమస్తే తెలంగాణ) : బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు స్టే విధించడం దురదృష్టకరమని ప్రభుత్వవిప్ ఆది శ్రీనివాస్ పేర్కొన్నారు. గురువారం హైకోర్టు తీర్పు అనంతరం ఆయన కోర్టు ఆవరణలో మీడియాతో మాట్లాడుతూ.. హైకోర్టు తీర్పుతో నిరాశ చెందినట్టు చెప్పారు. బీసీ రిజర్వేషన్ల కోసం ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేసినట్టు తెలిపారు. కేంద్రం సహకరించకపోయినా, గవర్నర్ పట్టించుకోకపోయినా చివరివరకు ప్రయత్నం చేసినట్టు తెలిపారు. నిపుణుల సలహాలతో ముందుకెళ్తామని స్పష్టంచేశారు.
బీసీ రిజర్వేషన్లకు సంబంధించి జీవో-9పై హైకోర్టు స్టే విధించడం దారుణం. ఇది తెలంగాణలో మరో సామాజిక విప్లవానికి తెరలేపింది. మెజార్టీ ప్రజల ప్రయోజనాలను అంధకారంలోకి నెట్టింది. ఇది తెలంగాణ సమాజాన్ని నిలువునా చీల్చే తీర్పు.