రంగారెడ్డి, యాచారం, మే 7 : రంగారెడ్డి జిల్లా యాచారం మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల్లో కోర్టు స్టే ఉన్నప్పటికీ అక్కడి భూములను ప్రభుత్వాధికారులు సర్వే చేసి, ఫెన్సింగ్ వేయడాన్ని హైకోర్టు తీవ్రంగా పరిగణించింది. అధికారులు కోర్టు ధిక్కరణకు పాల్పడ్డారంటూ షోకాజ్ నోటీసులు జారీచేసింది. మీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో కోర్టుకు వచ్చి చెప్పాలని ఆదేశించింది. యాచారం మండలంలోని మేడిపల్లి, నానక్‌నగర్, తాటిపర్తి, కుర్మిద్ద గ్రామాల్లో ఫార్మాసిటీ ఏర్పాటు కోసం అసైన్డ్, పట్టా భూములను ప్రభుత్వం సేకరించింది. నెల రోజుల క్రితం మండలంలో ఫార్మాసిటీ కోసం సేకరించిన భూములను రెవెన్యూ, టీజీఐఐసీ అధికారులు పోలీసుల బందోబస్తు నడుమ సర్వే చేసి ఫెన్సింగ్ ఏర్పాటు చేశారు. దీంతో రైతులు, వ్యవసాయ కూలీలు హైకోర్టును ఆశ్రయించారు.
భూములను సర్వే చేసి, ఫెన్సింగ్ వేసి ఆ భూముల్లోకి రాకుండా తమను అడ్డుకోవడం ద్వారా ఉపాధి అవకాశాలను దెబ్బతీశారని మండలంలోని మేడిపల్లి నానక్‌నగర్ గ్రామాలకు చెందిన సంద వజ్రమ్మ, నల్లొల్ల యాదమ్మ, కానమోని అచ్చమ్మ, మొరుగు జ్యోతి, గోల్కొండ హంసమ్మ, అందోజు విమలమ్మ, అందోజు మౌనిక, అందోజు వజ్రమ్మ తదితరులు ఆరోపించారు. భూసేకరణ చట్టం ప్రకారం భూములు సేకరించి, స్వాధీనం చేసుకుంటే కూలీలకు పునరావాసం కింద ఉపాధి అవకాశాలు కల్పించాల్సి ఉండగా, అధికారులు దానిని ధిక్కరించి తమ ఉపాధిపై దెబ్బకొట్టారని వాదించారు. మేడిపల్లి, నానక్‌నగర్ గ్రామాలకు సంబంధించి మొత్తం భూములపై స్టే ఉందని అధికారులకు పలుమార్లు విన్నవించినప్పటికి వారు పట్టించుకోవడంలేదని వాపోయారు. అడ్డుకునేందుకు వెళ్లిన తమపై దౌర్జన్యం చేశారని, అరెస్టు చేసి, కేసులు పెడుతామని పోలీసులు, అధికారులు బెదిరించినట్టు కోర్టుకు వివరించారు.
బాధిత రైతులు, కూలీల వాదనలు విన్న హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వినోద్‌కుమార్.. అధికారులు తప్పుడు చర్యలకు పాల్పడినట్టు నిర్ధారించారు. ఐఎఫ్ఎస్ వైస్ చైర్మన్, తెలంగాణ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (టీజీఐఐసీ) ఎండీ విష్ణువర్ధన్‌రెడ్డి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి, ఇబ్రహీంపట్నం ఆర్డీవో అనంతరెడ్డి, యాచారం తహసీల్దార్ అయ్యప్పలకు షోకాజ్ నోటీసులు జారీచేశారు. వీరంతా స్వయంగా కోర్టుకు వచ్చి కానీ, లేదంటే న్యాయవాది ద్వారా కానీ నాలుగు వారాల్లో వివరణ ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది.
హైకోర్టు ఆదేశాలపై రైతులు, కూలీలు హర్షం వ్యక్తంచేశారు. యాచారం మండలంలోని ఫార్మా బాధిత గ్రామాల్లోని రైతులు ప్రభుత్వంపై తొలిసారి విజయం సాధించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇదే స్పూర్తితో ముందుకెళ్తామని తెలిపారు.
అధికారులు దౌర్జన్యంగా వేసిన కంచెను వారితోనే తీయిస్తామని ఫార్మా వ్యతిరేక పోరాట సమితి సమన్వయకర్త కవుల సరస్వతి తెలిపారు. కోర్టు స్టే ఉన్నప్పటికీ, రైతులను బెదిరించి ఫెన్సింగ్ వేయడం సరికాదని పేర్కొన్నారు. భూసేకరణ చట్టం ప్రకారం అన్ని రకాల ప్యాకేజీలు, పునరావాసం, ఉపాధి కల్పించే వరకు పోరాడతామని స్పష్టంచేశారు.