హైదరాబాద్, నవంబర్ 19 (నమస్తే తెలంగాణ): బంజారాహిల్స్‌లోని విరించి వైద్యశాల నుంచి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు చేపట్టనున్న రోడ్డు విస్తరణ కోసం జీహెచ్ఎంసీ జారీచేసిన భూసేకరణ నోటీసులను హైకోర్టు నిలిపేస్తూ మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. వివరాల్లోకి వెళ్తే.. బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 12లో విరించి హాస్పిటల్ నుంచి అగ్రసేన్ జంక్షన్ వరకు ఉన్న భాగాన్ని 100 అడుగులకు, అగ్రసేన్ జంక్షన్ నుంచి కేబీఆర్ పార్కు మీదుగా జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వరకు ఉన్న రోడ్డును 120 అడుగులకు విస్తరించేందుకు భూసేకరణ కోసం సెప్టెంబర్ 18, అక్టోబర్ 1న జీహెచ్ఎంసీ నోటీసులు జారీచేసింది. ఈ భూసేకరణపై ఎవరికైనా అభ్యంతరాలుంటే నవంబర్ 19 మధ్యాహ్నంలోగా తెలియజేయాలని పేర్కొన్నది.
ఈ నోటీసులను సవాలు చేస్తూ కే విక్రమ్‌దేవ్ అనే వ్యక్తి, మరో 20 మంది హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ ఎన్వీ శ్రవణ్‌కుమార్ బుధవారం విచారణ జరిపారు. పిటిషనర్ల తరఫున సీనియర్ న్యాయవాది పీ శ్రీరఘురాం వాదనలు వినిపిస్తూ.. భూసేకరణ చట్టంలోని సెక్షన్ 11(1) కింద నోటీసు జారీచేసినట్టు ఆధారాలు లేవని, అధికారిక వెబ్ సైట్లోనూ నోటిఫికేషన్ కనిపించలేదని వివరించారు. అనంతరం న్యాయమూర్తి స్పందిస్తూ.. రోడ్డు విస్తరణ కోసం సేకరించే భూముల యజమానులందరికీ నోటీసులు ఇవ్వాల్సిన అవసరమున్నదని, కానీ కొందరికి నోటీసులే అందలేదని ప్రాథమికంగా తెలుస్తున్నదని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో సమగ్ర విచారణ నిమిత్తం భూసేకరణ నోటీసులను 2 వారాలపాటు నిలిపివేస్తున్నట్టు ప్రకటించారు. భూసేకరణ ప్రక్రియపై కౌంటర్ దాఖలు చేయాలని రాష్ట్ర రెవెన్యూ శాఖ ముఖ్యకార్యదర్శితోపాటు హైదరాబాద్ కలెక్టర్, భూసేకరణ అధికారి, జీహెచ్ఎంసీ డిప్యూటీ కమిషనర్, అసిస్టెంట్ సిటీ ప్లానర్, ఖైరతాబాద్ జోనల్ కమిషనర్‌ను ఆదేశిస్తూ.. తదుపరి విచారణను ఈ నెల 24కు వాయిదా వేశారు.